NIMS: నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఉద్యోగుల చిరకాల స్వప్నమైన ‘ఆర్జిత సెలవుల నగదు మార్పిడి కి ప్రభుత్వం పచ్చజెండా ఊపడం పట్ల నిమ్స్ ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. తమ విజ్ఞప్తిని మన్నించి, ఇచ్చిన మాట ప్రకారం సమస్యను పరిష్కరించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Rajanarasimha) ని మంగళ వారం నిమ్స్ ఉద్యోగులు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందించి, ఘనంగా సత్కరించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆదేశాలు జారీ..
ఎయిమ్స్ పే స్కేల్స్ పొందుతున్న నిమ్స్ రెగ్యులర్ ఉద్యోగులకు ఇప్పటి వరకు ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునే అవకాశం లేదు. ఇటీవల హాస్పిటల్ నర్సింగ్ అసోసియేషన్(Nursing Association) ప్రతినిధులు మంత్రిని కలిసి తమ ఆవేదనను వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, అధికారులతో చర్చించి తగు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి చొరవతో ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు (జీవో నం. 230) జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న ‘తెలంగాణ లీవ్ రూల్స్-1933’ నిబంధనల ప్రకారమే, ఇకపై నిమ్స్ ఉద్యోగులు కూడా తమ ఆర్జిత సెలవులను సరెండర్ చేసి నగదు పొందవచ్చునని జీవోలో పేర్కొన్నారు.
Also Read: Future City: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉత్తర్వులు జారీ..?
ఉద్యోగులకు ఆర్థికంగా..
మంత్రిని కలిసిన సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. తమ కష్టాన్ని గుర్తించి, ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించినందుకు మంత్రికి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది నిమ్స్ ఉద్యోగులకు ఆర్థికంగా లబ్ది చేకూరనుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పేషెంట్ల పట్ల చిర్రుబుర్రులు ఆడొద్దని, సహనంతో సానుభూతితోవ్యవహరించాలన్నారు.
Also Read: Hydraa: దుర్గం చెరువు ఆక్రమణలకు హైడ్రా చెక్.. కబ్జా చెర నుంచి 5 ఎకరాలకు విముక్తి

