Irrigation Neglect: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని మేజర్, మైనర్ కాల్వల నిర్వహణ గాలికి వదిలేశారు. అధికారుల నిర్లక్ష్యం, మొక్కుబడి చర్యల కారణంగా కాల్వలు అధ్వాన్నంగా మారి, చివరి భూములకు సాగునీరు అందక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటల సీజన్ ప్రారంభానికి ముందే మరమ్మతులు చేపట్టాల్సిన ఇరిగేషన్ శాఖ యంత్రాంగం కార్యాలయాలకే పరిమితం కావడంపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాల్వల పరిస్థితి దారుణం
సాగర్ ఎడమ కాల్వ పరిధిలో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కలిపి మొత్తం 83 మేజర్, మైనర్ కెనాల్స్ ఉన్నాయి. రాజవరం, రాజుపేట, కాకర్ల వంటి కీలకమైన మేజర్ కాల్వల ద్వారా వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా వీటిని నిర్మించారు. అయితే, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఈ కాల్వలన్నీ పిచ్చిమొక్కలు, గుర్రపుడెక్కతో నిండిపోయాయి. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వేసిన సీసీ లైనింగ్ దెబ్బతినడం, తూములు, షట్టర్లు తుప్పు పట్టడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది.
Also Read: Naga Vamsi: టికెట్ ధరల గురించి నిర్మాత నాగవంశీ ఏం చెప్పారంటే?.. రూ.99 అందుకే కష్టం..
గుర్రపు డెక్కతో నిలిచిన ప్రవాహం
కాల్వల్లో గుర్రపు డెక్క భారీగా పేరుకుపోవడంతో వదిలిన నీరు ముందుకు సాగడం లేదు. కాల్వల సామర్థ్యం 10 వేల క్యూసెక్కులు ఉన్నప్పటికీ, ప్రస్తుతం కేవలం 8 నుండి 9 వేల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. ఈ అరకొర నీరు కూడా గుర్రపు డెక్క అడ్డంకుల వల్ల చివరి భూములకు (టేలెండ్) అందడం లేదు. మిర్యాలగూడ ఇరిగేషన్ డివిజన్‌తో పాటు సాగర్ ఆయకట్టు పరిధిలో అధికారులు నిర్లక్ష్యం వీడి, కాల్వలను శుభ్రం చేయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రబీకి 81 రోజులు
ప్రస్తుత రబీ సీజన్ కోసం అధికారులు ‘ఆన్ అండ్ ఆఫ్’ పద్ధతిలో సాగునీటి విడుదల ప్రారంభించారు. డిసెంబర్ 7 నుంచి ఏప్రిల్ 2 వరకు ఏడు విడుతల్లో మొత్తం 81 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. సుమారు 1.13 లక్షల క్యూసెక్కుల నీటిని వదలాలని నిర్ణయించినప్పటికీ, కాల్వల దుస్థితి వల్ల ఈ నీరు పంటలకు పూర్తిస్థాయిలో అందుతుందా లేదా అన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నా, క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ అధికారులు మాత్రం కాల్వల నిర్వహణను విస్మరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని రైతన్నలు కోరుతున్నారు.
Also Read: Rajinikanth 173: రజనీకాంత్ ‘థలైవర్ 173’ చిత్రానికి ‘పార్కింగ్’ దర్శకుడు!.. షూటింగ్ ఎప్పుడంటే?

