ఈసారి జగన్ 2.o (Jagan 2.O)ని చూడబోతున్నారు, ఈ 2.0 వేరేగా ఉంటుంది అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన విజయవాడ వైసీపీ కార్పోరేటర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను అన్నారు. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను అని చెప్పారు.
“ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. జగనన్న 2.0 (Jagan 2.O) ని చూస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కార్యకర్తల్ని వేధించిన వారిని ఎక్కడ ఉన్నా వదలను. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలపెడతా. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రయివేటు కేసులు వేస్తాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ 30 ఏళ్ళు ఏలతాం” అంటూ జగన్ ధీమా వ్యక్తం చేశారు.