Coldwave Update: దేశవ్యాప్తంగా తీవ్రమైన చలి వాతావరణం కొనసాగుతోంది. కనిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఎముకలు కొరికే చలి వాతావరణం కొనసాగుతోంది. అయితే, రాబోయే రెండు మూడు రోజులు కూడా తెలంగాణలో ఇదే స్థాయిలో చలి తీవ్రత కొనసాగనుంది. కోల్డ్ వేవ్ ప్రభావంతో తీవ్రమైన చలిగాలులు కొనసాగుతాయని వాతావరణ అప్‌డేట్స్ ((Coldwave Update)) అందించే ‘తెలంగాణ వెధర్ మ్యాన్’ (ఎక్స్ పేజీ) హెచ్చరించింది. గాలి వేగం దాదాపుగా సున్నాకు పడిపోవడంతో తెలంగాణవ్యాప్తంగా వాయు నాణ్యత సూచీ (AQI) చాలా దారుణంగా ఉండే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఈ వాతావరణ ప్రభావంతో ఆకాశం మసకగా ఉండటంతో పాటు ఉదయం పూట దట్టమైన పొగమంచు కురుస్తుందని తెలిపింది. పగటి పూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం వంటి వాతావరణ మార్పులను గమనించవచ్చని తెలిపింది. మరోవైపు, రాత్రి సమయాల్లో ఉత్తర భారతదేశాన్ని తలపించేలా తీవ్రమైన చలి ఉంటుందని ‘తెలంగాణ వెధర్ మ్యాన్’ పేర్కొంది.
Read Also- Bank Loan News: ఓ వ్యక్తి రూ.1.7 కోట్ల లోన్ తీసుకుంటే 11 ఏళ్లలో రూ.147 కోట్లకు పెరిగింది.. ఎందుకంటే?
రిలీఫ్ ఎప్పటినుంచంటే?
కోల్డ్ వేవ్ కారణంగా ప్రస్తుతం తీవ్రమైన చలి వాతావరణం కొనసాగుతున్నప్పటికీ, జనవరి 1 తర్వాత చలి తీవ్రత తగ్గుతుందని ‘తెలంగాణ వెధర్ మ్యాన్’ పేర్కొంది. ప్రస్తుతమున్న తీవ్రమైన చలిగాలుల నుంచి ప్రజలకు ఉపశమనం దక్కుతుందని తెలిపింది. సుమారుగా 25 రోజుల పాటు కొనసాగిన ఈ సుదీర్ఘ కోల్డ్ వేవ్ సీజన్ జనవరి 1తో ముగిస్తుందని, ఆ తర్వాత వాతావరణం కాస్త రిలీఫ్‌గా ఉంటుందని వివరించింది. కాబట్టి, వచ్చే గురువారం నుంచి తెలంగాణ ప్రజలు కాస్త ఉపశమనం పొందవచ్చన్న మాట.
హైదరాబాద్‌లో ఎముకలు కొరికే చలి
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సైతం విపరీతమైన చలి వాతావరణం కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. దాదాపు గత 25 రోజుల నుంచి నగరంలో చలిగాలులు వీస్తున్నాయి. దీంతో, ఎముకలు కొరికే రేంజ్‌లో చలి పంజా విరుసుతోంది. సాయంత్రం 5 గంటల తర్వాత నుంచే చలి ప్రారంభమవుతోంది. రాత్రి 9 గంటల తర్వాత వాతావరణం మరింత చల్లగా ఉంటోంది. మూడు వారాలుగా ఇదే వాతావరణం కొనసాగుతుండడంతో జనాలు గజగజ వణుతున్నారు. ఇటీవలి కాలంలో చూడని విధంగా ఈ సీజన్‌లో కోల్డ్ వేవ్ (Cold Wave) సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఇవాళ (సోమవారం) ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంతంలో కనిష్ఠంగా 9.3 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది. మౌలాలిలో 9.8, రాజేంద్రనగర్‌లో 10.7, తిరుమలగిరిలో 10.7, గాయత్రీ నగర్‌లో 10.8, వెస్ట్ మారేడ్‌పల్లిలో 11, అల్వాల్‌లో 11, కుత్బుల్లాపూర్‌లో 11.1, గచ్చిబౌలిలో 11.2, జీడిమెట్లలో 11.6, బేగంపేటలో 12.6, చార్మినార్‌లో 12.9 డిగ్రీల సెల్సియస్ చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

