BJP Legislative Strategy: అసెంబ్లీ వేదికగా సర్కార్‌పై బీజేపీ జల యుద్ధానకి సిద్ధమవుతోంది. తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా నీటి పంపకాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ పక్కా వ్యూహంతో సిద్ధమైంది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలే లక్ష్యంగా అధికార పక్షాన్ని నిలదీసేందుకు బీజేపీ సన్నద్ధమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు అధ్యక్షతన జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న నీటి పంపకాల వివాదం, సాగునీటి రంగంలో వైఫల్యాలపై ప్రభుత్వాన్ని సభలో ఎండగట్టాలని నిర్ణయించారు.
ప్రధానంగా పెండింగ్ ప్రాజెక్టులు
ఈ సమావేశంలో ప్రధానంగా మూడు కీలక అంశాలపై బీజేపీ నేతలు చర్చించారు. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు పట్టుబట్టాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న హిల్ట్ పాలసీలోని లోపాలను, దాని వల్ల కలిగే నష్టాలను సభ దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నారు. అంతేకాకుండా ఇరిగేషన్ సమస్యలను లేవనెత్తాలని చూస్తున్నారు. ప్రధానంగా పెండింగ్ ప్రాజెక్టులు, కాల్వల నిర్వహణ, రైతులకు అందాల్సిన సాగునీటి సరఫరాలో జరుగుతున్న జాప్యంపై గళమెత్తనున్నారు. ఈ చర్చలకు మరింత పదును పెట్టేలా, కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ తో బీజేపీ ప్రతినిధులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నదీ జలాల కేటాయింపులు, అంతర్రాష్ట్ర వివాదాలు, సాంకేతిక అంశాలపై ఆయన నుంచి పూర్తిస్థాయిలో బ్రీఫింగ్ తీసుకున్నారు. తద్వారా సభలో గణాంకాలతో సహా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
Also Read: Bhatti Vikramarka: అక్రిడేషన్ల జీవో 252 ను సవరించేందుకు తక్షణ చర్యలు: భట్టి విక్రమార్క
సభలో సమన్వయం
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నీటి పంపకాలపై ప్రత్యేక చర్చకు పట్టుబట్టాలని, అవసరమైతే సభను స్తంభింపజేయడానికైనా వెనుకాడకూడదని పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న తీరుపై ప్రజాక్షేత్రంలోనే కాకుండా, అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. రామచందర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మొత్తానికి, ఈ దఫా అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటి అంశం ప్రధాన ఎజెండాగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాపక్షంగా బలంగా నిలబడి, ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి స్పష్టమైన సమాధానాలు రాబట్టే విధంగా పార్టీ తరఫున అనుసరించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. సభలో సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజలకు సంబంధించిన కీలక అంశాలను సమర్థంగా, ప్రభావవంతంగా లేవనెత్తాలన్న దిశగా సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఇదిలాఉండగా ఈ కీలక సమావేశానికి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాగా హైదరాబాద్ లో అందుబాటులో లేని ఎమ్మెల్యేలు జూమ్ ద్వారా పాల్గొన్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.
Also Read: Apple AirPods : యాపిల్ ఎయిర్‌పాడ్స్‌కు కలర్ వెర్షన్ వస్తుందా?

