YASANGI App Issues: ప్రతి రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేస్తామని ప్రకటించడంతోపాటు యాప్ ను యాసంగి నుంచి అందుబాటులోకి వ్యవసాయ శాఖ తీసుకొచ్చింది. అయితే ఈ యాప్ తో సమస్య పరిష్కరించకపోగా రైతన్న సమస్యను మరింత జఠిలం చేస్తుంది. కొత్త సమస్యలను తీసుకొచ్చి పెడుతుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక రైతన్న సతమతం అవుతున్నారు.
అసలు సమస్య ఇక్కడే..
వాన కాలంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దానిని అధిగమించేందుకు వ్యవసాయ శాఖ యాప్ ను తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఈ యాసంగిలో 50 లక్షల ఎకరాల్లో రైతులు పంట సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. దానికి అనుగుణంగా యూరియా సరఫరాకు ప్రణాళికలు రూపొందించారు. అవసరమైన రైతులు ఈ యాప్ లో వివరాలు నమోదు చేసుకుంటే యూరియాను కావలసిన రోజు బుక్ చేసుకుంటే ఇవ్వడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. వ్యవసాయం సాగు చేసే రైతులు అధికశాతం మంది నిరక్షరాశులు. మొబైల్ ఫోన్ వాడుతున్నప్పటికీ సంబంధిత యాప్లపై అవగాహన ఉండదు. అయితే వారికి ఏఈఓ(AEO) లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
యూరియా వేయడంలో ఆలస్యం..
అయితే కొంతమంది రైతులు గత మొబైల్ నెంబర్ మార్చడం.. పనిచేయకపోవడం వంటి అంశాలు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారాయి. యాప్ లో సంబంధిత రైతు వివరాలు నమోదు చేసుకుంటే గతంలో లింక్ చేసిన మొబైల్ నెంబర్కు ఓటిపి వస్తుంది. అయితే ఆ నెంబరు లేకపోవడంతో కొత్త నెంబర్ అప్లోడ్ చేసే సందర్భంలో ఆలస్యం అవుతుంది. కొంత గడువు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సమయంలో రైతులు పంటలకు యూరియా వేయడంలో ఆలస్యం అవుతుంది. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది రైతులు చేసేదేమీ లేక ప్రాథమిక సహకార సంఘాల వద్ద, మార్కెట్ యార్డ్ ల వద్ద, ప్రైవేటు దుకాణాల వద్ద క్యూలైన్ కడుతున్న పరిస్థితి నెలకొంది. పాసుబుక్కులు తీసుకొని గంటలకు నిలబడుతున్న సంఘటనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం వరి, మొక్కజొన్న, మిర్చి సాగు అవుతుంది. వీటికి యూరియా వేయాల్సిన సమయం రావడంతో రైతులు విక్రయ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో యాసంగి ప్రారంభమై నెల రోజులు కావస్తున్నప్పటికీ యూరియా కావలసిన నిల్వలను సరఫరా చేయకపోవడంతోనే దీనికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి.
Also Read: Lorry Hits Bike: అక్కడికక్కడే అక్కాతమ్ముడి మృతి.. సత్తుపల్లిలో ఘోర ప్రమాదం
కేంద్రాల వద్ద పడి కాపులు
మరోవైపు రైతులు యాప్ లో బుక్ చేసుకుందామనుకున్నా సర్వర్ డౌన్ అవుతున్నట్లు సమాచారం. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు మాత్రం యాప్ లో నమోదు చేసుకుంటే ఎకరాకు మూడు బస్తాల యూరియా సరఫరా చేస్తామని, రెండు ఎకరాల పైబడిన వారికి.. 5 ఎకరాల లోపు వారికి రెండు విడతలుగా.. ఐదు ఎకరాలకు పైబడిన వారికి మూడు విడతలుగా యూరియా సరఫరా చేస్తామని పేర్కొంటున్నారు. అయితే సర్వర్ డౌన్ తోటి అప్ లో వివరాలు నమోదు కాకపోవడం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చేసేదేమి లేక రైతులు విక్రయ కేంద్రాల వద్ద పడి కాపులు కాస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా కల్లూరు, వరంగల్ జిల్లా శంభునిపేట పిఎసిఎస్ కేంద్రం వద్ద రైతులు భారీగా తరలివచ్చారు. దీనికి తోడు డిమాండ్ తగిన విధంగా యూరియా సరఫరా లేకపోవడంలో రైతులు కు ఇబ్బందులు తప్పడం లేదు.
యూరియా బుకింగ్ నమోదు
ఇది ఇలా ఉంటే యాప్ లో యూరియా బుకింగ్ సమయంలో కొంతమంది వ్యవసాయ అధికారులు వానాకాలంలో తమ పంటను విక్రయించిన సమయంలో ఇచ్చిన బిల్లులను చూపాలని.. అప్పుడు ఎన్ని ఎకరాల్లో వేశారు ఎన్ని యూరియా బస్తాలు అవసరం అని తెలుస్తుందని అంటున్నారని.. దీనిని లింకు పెట్టడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని సమాచారం. మహబూబాబాద్ ఓ రైతు వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్తే వానకాలం పంటను అమ్మిన రిసిప్ట్లు తీసుకురావాలని సూచించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్ నెంబర్ భూమి పాస్బుక్ లింక్ అయి ఉన్నప్పటికీ ధాన్యం అమ్మిన రిసీట్లు ఎందుకని ప్రశ్నించినట్లు సమాచారం. ఇలా యాప్ లో యూరియా బుకింగ్ నమోదు కు లింకులు పెడుతుండడంతో రైతులకు ఇబ్బంది తప్పడం లేదు.
Also Read: Instagram: యూఎస్‌లో ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం
ధర కంటే 50 రూపాయలు అధికం
మరోవైపు ఇదే అదునుగా భావించిన ప్రైవేటు ఫెర్టిలైజర్స్ దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మార్కెట్లో డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడంతో బస్తా కు ఎమ్మార్పీ ధర కంటే 50 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రైవేటు దుకాణదారులు వారికి పరిచయం ఉన్న వ్యక్తులకు యూరియా ఇస్తున్నారని.. బుక్ చేసుకున్నవారు సంబంధిత దుకాణానికి వెళితే స్టాక్ లేదని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం కారణంగానే యూరియా కొరత కారణమని.. మరోవైపు యాప్ కూడా కారణమని విమర్శలు వస్తున్నాయి.
సర్వర్ డౌన్ కాకుండా చర్యలు
ఇది ఇలా ఉంటే అధికారులు మాత్రం యాసంగిలో యూరియా కొరత నివారణ కోసమే యాప్ తీసుకొచ్చామని పేర్కొంటున్నారు. యాప్ తో కావలసినవారు బుక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండదని యూరియా కొరత ఏర్పడదని.. అవసరం లేని వారు ముందస్తుగా బుక్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఏ ఏ కేంద్రాల్లో ఎంత యూరియా స్టాక్ ఉందో తెలుసుకోవచ్చని.. బుక్ చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. అయితే అధికారులు చెప్పినంత సులువుగా క్షేత్రస్థాయిలో లేకపోవడం.. ముందస్తు పంటలు సాగు చేసే జిల్లాల్లో యూరియాను డిమాండ్ కు తగిన విధంగా అందుబాటులో ఉంచకపోవడంతో రైతులు విక్రయ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన విధంగా యూరియాను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని… ఈ యాప్ సర్వర్ డౌన్ కాకుండా చర్యలు చేపట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. గత వానకాలం ఘటన పునరావృతం కాకుండా అధికారులు ఇకనైనా స్పందించి చర్యలు చేపడతారా లేదా అనేది చూడాలి.
Also Read: Plane Crash: ఆకాశంలో బ్యానర్ ప్రదర్శిస్తూ సముద్రంలో కూలిన విమానం..

