KTR Praises PJR: ప్రజల ప్రయోజనాల కోసం సొంత ప్రభుత్వాన్ని నిలదీసిన ధైర్యశాలి పీజేఆర్
కృష్ణ జలాలు తెచ్చి హైదరాబాద్ దాహార్తిని తీర్చారు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ‘‘నాడు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూనే, ప్రజల ప్రయోజనాల కోసం సొంత ప్రభుత్వాన్ని నిలదీసిన ధైర్యశాలి పీజేఆర్. హైదరాబాద్ మహానగర రాజకీయాల్లో గత యాభై ఏళ్లుగా చెరగని ముద్ర వేసిన ధీశాలి. నిఖార్సైన మాస్ లీడర్ పీ. జనార్ధన్ రెడ్డి (పీజేఆర్)’’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ చౌరస్తాలో ఆదివారం పీజేఆర్ 18వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
కృష్ణా జలాలు తెచ్చి హైదరాబాద్ దాహార్తి తీర్చాలనే నినాదంతో పీజేఆర్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అద్భుత అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఉంటే, పీజేఆర్ గుండె ఆనందంతో పులకించిపోయేదని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధిపై పీజేఆర్‌కి ఉన్న విజన్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిజం చేసిందని అన్నారు. భవిష్యత్ తరాల నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా, ప్రజా సేవలో పీజేఆర్ చూపిన నిబద్ధతను, శ్రద్ధను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సేవలోనే కన్నుమూసే అరుదైన భాగ్యం పీజేఆర్‌కి దక్కిందని ఆయన అన్నారు.
Read Also- Home Remedies: కడుపు నొప్పితో బాధపడుతున్నారా.. అయితే, ఈ సహజ చిట్కాలతో చెక్ పెట్టేయండి!
పీజేఆర్ ఆశయాలను ఆయన సుపుత్రుడు, మాజీ శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కేటీఆర్ మెచ్చుకున్నారు. ఒకవైపు జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయాన్ని పీజేఆర్ ఆలోచనలకు అనుగుణంగా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అభివృద్ధి చేయడంతో పాటు, మరోవైపు హైదరాబాద్ నగర ప్రజల సంక్షేమంలో విష్ణు తనదైన పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ఏ తండ్రికైనా తన సంతానం ఇచ్చే గొప్ప ట్రిబ్యూట్ వారి ఆశయాలను కొనసాగించడమేనని, ఆ విషయంలో విష్ణువర్ధన్ రెడ్డి సఫలమయ్యారని అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాగంటి సునీత గోపీనాథ్, కార్పొరేటర్లు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Read Also- Huma Qureshi as Elizabeth: యష్ ‘టాక్సిక్’ సామ్రాజ్యంలో ‘ఎలిజబెత్’గా హుమా ఖురేషి.. పోస్టర్ పీక్స్..

