Telangana BJP: తెలంగాణ భారతీయ జనతా పార్టీలో సంస్థాగత మార్పులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్యాడర్‌కు నిరాశే ఎదురవుతోంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన సమయంలో, కమిటీల నియామకంలో జరుగుతున్న తాత్సారం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు కేవలం మోర్చాలు, జిల్లా అధ్యక్షుల నియామకాలకే పరిమితమైన రాష్ట్ర నాయకత్వం, పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీని ఎప్పుడు ప్రకటిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి సుదీర్ఘ కాలం గడుస్తున్నా, ఇప్పటికీ పూర్తిస్థాయి కార్యవర్గం కొలువుదీరకపోవడం గమనార్హం. పార్టీలో క్రియాశీలకంగా ఉండాల్సిన విభాగాలకు సారథులు లేకపోవడం వల్ల పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత దూకుడు పెంచాల్సిన బీజేపీ, ప్రస్తుతం అంతర్గత నియామకాల విషయంలో మందగమనంలో సాగుతోంది.
అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు
బీజేపీలో నెలకొన్న ఈ జాప్యంపై పార్టీ సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే పార్టీ పనితీరుపై ఆరా తీసిన ఆయన, కమిటీల ఏర్పాటులో ఎందుకు జాప్యం జరుగుతోందని రాష్ట్ర యూనిట్‌ను నిలదీసినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు కీలకమైన కమిటీలను పెండింగ్‌లో పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం నామమాత్రపు నియామకాలతో సరిపెట్టకుండా, పూర్తిస్థాయిలో సమర్థవంతమైన నాయకులతో కూడిన బృందాన్ని ఎందుకు సిద్ధం చేయలేదని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షులను నియమించిన రాష్ట్ర నాయకత్వం పూర్తి కమిటీని నియమించకపోవడంతో గ్రౌండ్ లెవల్లో పని చేయడం ఎలా సాధ్యమవుతుందని నిలదీసినట్లు తెలుస్తోంది. తాత్సారం వీడి మోర్చాలు, జిల్లా కమిటీలు పూర్తిస్థాయిలో నియమించాలని ఆదేశించినట్లు సమాచారం.
Also Read: Mysuru Palace: మైసూరు ప్యాలెస్ దగ్గర హీలియం సిలిండర్ పేలుడు.. ముగ్గురు మృతి
రాష్ట్ర నాయకత్వం చర్యలు
కమిటీల నియామకం కోసమే రాష్ట్ర నాయకత్వం ఇటీవల కోఆర్డినేటర్లను నియమించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై చంద్రశేఖర్ తివారి ఆరా తీయడంతో ఎట్టకేలకు రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. మహంకాళి జిల్లా కమిటీని నియమించింది. ఆరుగురు జిల్లా ఉపాధ్యక్షులను, ముగ్గురు జిల్లా ప్రధాన కార్యదర్శులను, ఐగుగురు కార్యదర్శులను, కోశాధికారి, సోషల్ మీడియా ఇన్ చార్జీ, మీడియా కన్వీనర్, ఐటీ ఇన్ చార్జీని నియమించారు. ఇదిలా ఉండగా పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలు తమకు గుర్తింపు ఎప్పుడొస్తుందా అని వేచి చూస్తున్నారు. మిగతా జిల్లాల్లో కమిటీల ప్రకటన ఆలస్యమవుతుండటంతో ద్వితీయ శ్రేణి నాయకత్వంలో కొంత నైరాశ్యం అలుముకుంది. చంద్రశేఖర్ తివారి జోక్యంతోనైనా కమిటీల కసరత్తు కొలిక్కి వచ్చి, త్వరలోనే పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీని ప్రకటిస్తారా? లేక ఇంకా వెయిటింగ్ తప్పదా అనేది వేచి చూడాలి.
Also Read: GHMC Mega Budget: మెగా బడ్జెట్‌కు రూపకల్పన చేసిన జీహెచ్ఎంసీ.. ఎంతో తెలుసా?

