RajaSaab SKN: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వస్తున్న భారీ హారర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ SKN చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ప్రాణ స్నేహితుడు మారుతి పడిన కష్టాలను, అతనికి ప్రభాస్ అందించిన అద్భుతమైన మద్దతును గుర్తు చేసుకుంటూ SKN అత్యంత ఉద్వేగభరితంగా మాట్లాడారు. SKN మాట్లాడుతూ.. 2021 చివరిలో ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలైందో వివరించారు. “మారుతికి ఒక పరాజయం ఎదురైన సమయంలో, అతని తండ్రి అకాల మరణం చెందారు. ఆ సమయంలో మారుతి మానసికంగా చాలా కృంగిపోయాడు. ప్రభాస్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసే అవకాశం మళ్ళీ వస్తుందో లేదో అని భయపడ్డాడు. కానీ ప్రభాస్ మారుతిని పిలిచి, ‘నువ్వు చెప్పిన స్క్రిప్ట్ నాకు నచ్చింది, మనం సినిమా చేస్తున్నాం’ అని భరోసా ఇచ్చారు. ప్రభాస్ గారు ఒక్కసారి మాట ఇస్తే ఇక లెక్కలు, చర్చలు ఉండవు. ఆయనది ‘కింగ్ సైజ్’ హృదయం” అని SKN కొనియాడారు.
Read also-Maruthi Emotional: నేను రాశాను.. తీశాను.. వెనకాల ఉన్నది మాత్రం ప్రభాస్.. మారుతీ..
మారుతి తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ SKN కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. “మేమిద్దరం 20 ఏళ్లుగా స్నేహితులం. ఫిల్మ్ నగర్‌లో రూ.20 రూపాయల భోజనం కోసం డబ్బులు సరిపోక, ముగ్గురం కలిసి పంచుకుని తిన్న రోజులు ఉన్నాయి. మారుతి తండ్రి అరటిపండ్ల వ్యాపారం చేసేవారు. అలాంటి సామాన్య నేపథ్యం నుండి వచ్చిన మారుతిని నమ్మి, ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాను అప్పగించిన ప్రభాస్ గారికి మేం రుణపడి ఉంటాం” అని పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో ప్రభాస్ చూపించే మర్యాద గురించి చెబుతూ.. “యూరోప్ షెడ్యూల్ సమయంలో ప్రభాస్ ఒక పెద్ద విల్లాను రెంట్ కి తీసుకున్నారు. అది తన కోసం కాదు, అక్కడ కిచెన్ లో తన చెఫ్ లతో మన భోజనం వండించి యూనిట్ అందరికీ పెట్టడం కోసం. షూటింగ్ ఎక్కడ జరిగినా ఆయన అందరినీ ఒకేలా చూసుకుంటారు” అని ప్రభాస్ మంచితనాన్ని చాటి చెప్పారు.
అభిమానులకు తీపి కబురు అందిస్తూ, తాను ఇప్పటికే 3 నిమిషాల 21 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్‌ను చూశానని SKN వెల్లడించారు. ఈ ట్రైలర్ చూశాక ఇక విమర్శలకు తావుండదని, ప్రభాస్ మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తన రాజ్యాన్ని ఏలుతారని ధీమా వ్యక్తం చేశారు. సినిమా రన్ టైమ్ సుమారు 3 గంటల 10 నిమిషాలు ఉంటుందని, జనవరి 9న థియేటర్లలో ‘మాస్ ధమాకా’ గ్యారెంటీ అని స్పష్టం చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మించారని, తమన్ సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎసెట్ అని SKN తన ప్రసంగాన్ని ముగించారు.

