స్వేచ్ఛ, స్పెషల్ డెస్క్: హైందవ ధర్మంలో సూర్యుడిది ప్రత్యేక స్థానం. లోకానికి వెలుగులు ప్రసాదించే సూర్య భగవానుడు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రోజున జన్మించినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతీ ఏడాది ఆ రోజున రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఎప్పటిలాగే ఈసారి కూడా రథసప్తమి వేడుకలు కన్నులపండువుగా సాగాయి. ఈ పర్వదినాన ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా తిరుమల క్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
సప్త వాహనాలపై శ్రీనవాసుడి కటాక్షం
రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో స్వామి, అమ్మవార్లు సప్త వాహనాలపై విహరించి భక్తులను కటాక్షించారు. గోవిద నామస్మరణతో మాడవీధులు మార్మోగాయి. సూర్యప్రభ వాహనంతో మొదలై, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు అనుగ్రహించారు. ఈ మినీ బ్రహ్మోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై శ్రీవారిని ఊరేగించారు.
ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం, ఉ.11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహన సేవలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు హనుమ వాహనంపై స్వామివారు ఊరేగారు. మ.2 గంటల నుంచి మ.3 గంటల సమయంలో పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం జరిగింది. సా.4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులను కటాక్షించారు. సా.6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవలు కొనసాగాయి.
సప్త స్వర్ణ శోభితంగా ముస్తాబు
రథపస్తమి నేపథ్యంలో తిరుమల ఆలయాన్ని సప్త వర్ణ శోభితంగా టీటీడీ ముస్తాబు చేసింది. సప్త వాహనాలపై శ్రీవారు భక్తులకు అభయం అందించడానికి సూచికగా ప్రత్యేకంగా అధికారులు ముస్తాబు చేశారు. విద్యుత్, పుష్పాలంకరణతో తిరుమల భూతల వైకుంఠాన్ని తలపించింది. ఆలయ మహాద్వార గోపురంతో పాటు ప్రాకారం, ధ్వజస్తంభం, ఆలయ పరిసర ప్రాంతాలన్నీ పుష్పాలంకరణతో అద్భుతంగా కనిపించాయి. ఆలయంలో లోపల, బయట దాదాపు 10 టన్నుల పుష్పాలతో అలంకరణ చేశారు.