GHMC: నెల రోజుల క్రితం వరకు మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కొనసాగిన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)లోని ప్రాంతాలు ఇపుడు జీహెచ్ఎంసీలో విలీనమై 60 సర్కిళ్లుగా, 12 జోన్లుగా ఏర్పాటు చేసి సరి కొత్త పరిపాలనకు సర్కారు శ్రీకారం చుట్టడటంతో విలీన ప్రాంత ప్రజలు మున్ముందు తమకు మరింత మెరుగైన పౌర సేవలు, అత్యవసర సేవలందుతాయని, వాటితో పాటు వేగంగా అభివృద్ది జరుగుతుందన్న అంచనాల్లో ఉన్నారు. మొత్తం 27 పట్టణ స్థానిక సంస్థలు ఇపుడు మున్సిపల్ వార్డులుగా, సర్కిళ్లుగా ఏర్పడటంతో జీహెచ్ఎంసీ కోర్ సిటీలో అందిస్తున్న మెరుగైన సేవలు ఇక తమకు కూడా అందుతాయని విలీన ప్రాంతాలు ఆశల పల్లకిలో ఊరేగుతున్నాయి.
ఒకే కార్పొరేషన్ గా కొనసాగుతుందా?
జీహెచ్ఎంసీ పాత పరిధి 650 కిలోమీటర్ల నుంచి 2 వేల 50 కిలోమీటర్లకు పెరగటంతో హైదరాబాద్ నగరం దేశంలోనే అతి పెద్ద నగరంగా మారింది. ఒకే కార్పొరేషన్ గా కొనసాగుతుందా? మున్ముందు మూడు ముక్కలుగా విడిపోతుందా? అన్న అంచనాలను పక్కన బెడితే ఒకే కార్పొరేషన్ గా కొనసాగినంత కాలం పౌర, అత్యవసర సేవల నిర్వహణ ఒక రకంగా జీహెచ్ఎంసీకి సవాలుగానే మారనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలను తలపించే స్థాయిలో ఉన్న విలీన ప్రాంతాలున్న నేపథ్యంలో కోర్ సిటీలో జరగుతున్న విజుబిలిటీ డెవలప్ మెంట్ పనులు విలీన ప్రాంతాల్లో కూడా జరిగేందుకు కొంత సమయం పట్టే అవకాశమున్నప్పటికీ, మున్ముందు హెచ్ సిటీ పనులను విలీన ప్రాంతాలకు విస్తరించేలా జీహెచ్ఎంసీ కార్యాచరణను సిద్దం చేస్తున్నట్లు సమాచారం.
Also Read: GHMC: 29న స్టాండింగ్ కమిటీ మీటింగ్.. కమిటీ ముందుకు రానున్న 15 అంశాల అజెండా!
18 ఏళ్లలో రెండుసార్లు రూపాంతరం
హైదరాబాద్ నగర పాలక సంస్థ గడిచిన 18 ఏళ్లలో రెండుసార్లు రూపాంతరం చెంది, ఇపుడు దేశంలోని అతి పెద్ద నగరంగా, జీహెచ్ఎంసీ అతి పెద్ద స్థానిక సంస్థగా అవతరించింది. గతంలో 2007 కు ముందున్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్) కేవలం 72 కిలోమీటర్ల పరిధిలో కేవలం ఏడు సర్కిళ్లుగా ఉన్నపుడు సైతం పౌర సేవలు, అత్యవసర సేవల నిర్వహణకు సంబంధించిన అనేక సమస్యలు తలెత్తేవి. ఆ తర్వాత శివారులోని 12 మున్సిపాల్టీల విలీనంతో పరిధి ఒక్కసారిగా 650 చదరపు కిలోమీటర్లకు పెరిగి, అంచలంచెలుగా 30 సర్కిళ్లుగా విస్తరించినా, పౌర సేవల నిర్వహణ, అత్యవసర సేవల నిర్వహణలో జీహెచ్ఎంసీ దినదిన గండం నూరేళ్లు ఆయుశ్శుగా నే మారింది.
వివిధ విభాగాల వారీగా పౌర, అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీలోని ఏ ఒక్క విభాగం కూడా నేటికీ సైతం నూటికి నూరు శాతం ప్రజలు ఆశించిన స్థాయిలో సేవలందించటంలో విఫలమవుతూనే ఉంది. ఇలాంటి లోటుపాట్లు సరిదిద్దుకునేందుకు అధికారులు కొంత టెక్నాలజీని వినియోగించుకుంటున్నా, ఆశించిన ఫలితాలను సాధించలేకపోతున్నారు. ఇపుడు ఏకంగా పరిధి మూడింతలు ఎక్కువగా అంటే 2 వేల 50 కిలోమీటర్లకు పెరగటం, విలీనానికి ముందు విలీన ప్రాంతాల్లో వివిధ రకాల సేవలందించే యంత్రాంగం, విభాగాలున్నా, ఇపుడవన్నీ జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం విధులు నిర్వర్తించాల్సి ఉంది. ఒక్కసారిగా గ్రేటర్ కోర్ సిటీలో అందుతున్న సేవల తరహాలో సేవలందకపోయినా, దశల వారీగా సేవలు మరింత మెరుగుగా అందటంతో పాటు ఆధునిక రవాణ వ్యవస్థలైన ఫ్లై ఓవర్లు, మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, ఫుటోవర్ బ్రిడ్జిలు వంటివి విలీన ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి.
జోన్లకు పెరగనున్న పవర్స్
2 వేల 50 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రజలు వివిధ రకాల పనులపై ట్యాంక్ బండ్ సమీపంలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చే అవసరం లేకుండా మెరుగైన పౌర సేవలు, వేగవంతమైన అభివృద్ది వంటివి సాధించేందుకు జోనల్ కమిషనర్లకు అదనపు పవర్స్ కేటాయించే అవకాశాలున్నట్లు సమాచారం. నిధుల మంజూరీకి సంబంధించి పరిపాలనపరమైన అధికారాలు, పౌర సేవల నిర్వహణ, అత్యవసరసేవల నిర్వహణ, ఫ్లడ్ మేనేజ్ మెంట్, వరదల సహాయక చర్యలు, మాన్సూన్ యాక్షన్ టీమ్ లు వంటి అంశాలకు సంబంధించి జోనల్ కమిషనర్లకు అదనపు అధికారాలను కేటాయించే దిశగా, ప్రకృతి వైపరీత్యాలు జరిగినపుడు అప్పటికపుడే సహాయం అందించేందుకు జోనల్ కమిషనర్ తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన సహాయక చర్యల కోసం కూడా అదనపు అధికారాలను కేటాయించేందుకు గాను జీహెచ్ఎంసీ మున్సిపల్ యాక్టు-1959లో సవరణలు చేసేలా అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
Also Read: GHMC: అక్రమ అనుమతులు..అడ్డదారిలో ఓసీలు.. 27 సర్కిళ్లలో వెలుగులోకి సంచలనాలు..!

