Anaganaga Oka Raju: నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty).. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుసగా మూడు ఘన విజయాలతో నటుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) చిత్రం 2026 సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలతో ప్రమోషనల్ కంటెంట్‌లోనూ వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం నుంచి.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘భీమవరం బాల్మా’ మంచి ఆదరణను రాబట్టుకోగా, తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సాంగ్‌గా ‘రాజు గారి పెళ్లిరో’ (Raju Gaari Pelli Ro) లిరికల్ వీడియోను విడుదల చేశారు. ‘వెడ్డింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’గా విడుదలైన ఈ పాట ఎలా ఉందంటే..
Also Read- Sivaji: వ్యక్తిగత విషయాలు వదిలేసి ‘దండోరా’ను హిట్ చేయండి.. లేదంటే నేనే నింద మోయాలి!
ఎప్పటికీ నిలిచిపోయే పెళ్లి పాట
‘అనగనగా ఒక రాజు’ నుంచి తాజాగా వచ్చిన ‘రాజు గారి పెళ్లిరో’ సాంగ్ డ్యాన్స్ నంబర్‌గా అందరినీ ఆకర్షిస్తోంది. మాస్‌తో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉత్సాహభరితంగా, ఓ పండగ వాతావరణాన్ని ఈ పాట క్రియేట్ చేస్తోంది. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే పెళ్లి పాటలలో ఒకటిగా ఇది నిలుస్తుందనడంలో సందేహమే లేదు. ఈ పాటలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ వారి ఎనర్జీతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారని చెప్పొచ్చు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన డ్యాన్స్.. ఇకపై రీల్స్‌తో హడావుడి చేసేలా ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మరో విశేషం ఏమిటంటే.. ఈ పాటలో రావు రమేష్ సహా ప్రధాన నటీనటులంతా పాల్గొనడం. వీరందరి కలయికతో ఈ సాంగ్ నిజంగానే సంబరాన్ని తెచ్చేసింది. సంక్రాంతి సంబరానికి సరైన సాంగ్‌గా నిలిచేలా చేస్తోంది.
Also Read- CM Chandrababu: రప్పా రప్పా చేస్తారా.. బాబాయ్‌ని లేపేసి నింద వేస్తారా.. సీఎం చంద్రబాబు వైల్డ్ ఫైర్
సంబరాన్ని ముందే తెచ్చేసింది
ఇప్పటికే విడుదలైన ‘భీమవరం బాల్మా’ మంచి స్పందనను రాబట్టుకుని, అందరి నోళ్లలో నానుతుంది. ఆ పాట సక్సెస్ తర్వాత ఈ పెళ్లి గీతంతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను టీమ్ గెలుచుకుంది. ‘రాజు గారి పెళ్లిరో’ను అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ ఆలపించగా, ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించారు. మిక్కీ జె. మేయర్ స్వరాలు ఈ పాటను ఫెస్టివల్ సాంగ్‌గా మలిచాయి. రంగురంగుల దృశ్యాలు, ఉత్సాహభరితమైన డ్యాన్స్, కాలు కదిపేలా చేస్తున్న మ్యూజిక్‌తో ఈ పాట నిజమైన సంబరాన్ని ముందే తెచ్చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన కంటెంట్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను అందుకుంది. ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్‌తో పాటు ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయనుందని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2026, జనవరి 14న భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

