Phone Tapping Case: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విచారణ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా ప్రముఖ సెఫాలజిస్టు ఆరా మస్తాన్ (Aara Mastan)ను సిట్ (SIT) బృందం విచారణ చేసింది. దాదాపు రెండున్నర గంటల పాటు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. సిట్ విచారణ అనంతరం బయటకొచ్చిన ఆరా మస్తాన్.. కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసు ముగింపు దశకు చేరుకున్నట్లు పేర్కొన్నారు.
‘మళ్లీ అవే ప్రశ్నలు అడిగారు’
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తనను సాక్షిగా విచారణ చేసినట్లు ఆరా మస్తాన్ స్పష్టం చేశారు. గతంలోనే ఆయన్ను ఓ సారి సిట్ బృందం విచారించగా.. ఇవాళ కూడా మరోమారు ప్రశ్నించింది. విచారణ అనంతరం ఆరా మస్తాన్ మాట్లాడుతూ.. గతంలో అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారని పేర్కొన్నారు. తనకు తెలిసిన మెుత్తం విషయాలను సిట్ అధికారులకు చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ చెప్పిన అంశాలను క్రాస్ చెక్ చేసుకునేందుకు తనను విచారణకు పిలిచినట్లు పేర్కొన్నారు. ముఖ్యమైన సాక్షులందరినీ ఈ కేసులో విచారణకు పిలుస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన ఆరా మస్తాన్ విచారణ
రెండున్నర గంటల పాటు విచారించిన సిట్ అధికారులు
సాక్షిగా ఆరా మస్తాన్ స్టేట్మెంట్ రెండోసారి తీసుకున్న సిట్ అధికారులు
గతంలో చెప్పిన విషయాలను అధికారులు మళ్ళీ అడిగారు అన్న ఆరా మస్తాన్
ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు చెప్పిన అంశాలను… pic.twitter.com/GE0n6ElDw0
— BIG TV Breaking News (@bigtvtelugu) December 26, 2025
‘మళ్లీ విచారణకు పిలవొచ్చు’
అయితే తనను మళ్లీ విచారణకు పిలిచే అవకాశముందని సెఫాలజిస్టు ఆరా మస్తాన్ అన్నారు. ఇంకో వారంలో విచారణకు హాజరు కావొచ్చని అంచనా వేశారు. కాగా విచారణ సందర్భంగా తన ఫోన్ ట్యాప్ అయిన డేటాను తన ముందు ఉంచినట్లు ఆరా మస్తాన్ తెలిపారు. ఈ సందర్భంగా 2020లోనే తన ఫోన్ ట్యాప్ అయినట్లు తనకు తెలిసిందని చెప్పారు. సిట్ అధికారులు చూపిన డేటా ప్రకారం తన రెండు ఫోన్లు ట్యాప్ అయ్యాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం సిట్ లో ఉన్నతస్థాయి అధికారులు ఉన్నారు కాబట్టి త్వరలో చార్జి షీట్ వేసే అవకాశం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఈ కేసు తుది దశకు చేరుకుంటుందని చెప్పారు.
Also Read: KTR on CM Revanth: మా అయ్య మెుగోడు.. తెలంగాణ తెచ్చినోడు.. సీఎంకు కేటీఆర్ కౌంటర్
సీపీతో సిట్ సమాలోచనలు
ఇదిలా ఉంటే విచారణాధికారిగా ఉన్న హైదరాబాద్ కమీషనర్ వీసీ సజ్జనార్ (V.C. Sajjanar)తో సిట్ బృందం బుధవారం సమావేశమైంది. కోర్టుకు సమర్పించనున్న అదనపు ఛార్జీషీట్ లో పొందు పరచాల్సిన అంశాలపై సమాలోచనలు చేసింది. రెండు వారాల విచారణలో వెల్లడైన అంశాలతో సుప్రీం కోర్టుకు సమర్పించనున్న నివేదికపై కూడా చర్చించినట్టు సమాచారం. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు (Prabhakar Rao)ను సిట్ బృందం గత కొన్నిరోజులుగా విచారిస్తూ వస్తోంది. అయితే సిట్ వేసిన చాలా ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం. ఓ దశలో అప్రూవర్ గా మారాలని కూడా సిట్ బృందం అతడికి సూచించినట్లు తెలిసింది.

