Kishan Reddy: యువతకు మాజీ ప్రధాని అటల్ జీవితం స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. వాజ్ పేయి 101 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అటల్ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అటల్.. తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నారన్నారు. ఆయన త్యాగశీలులుడని, నైతిక విలువలకు కట్టుబడిన వ్యక్తిగా కొనియాడారు. ఒక్క ఓటు కోసం ప్రధాని పదవిని త్యాగం చేసిన నేత అంటూ కొనియాడారు. ఢిల్లీ నుంచి లాహోర్ కు బస్సులో వెళ్లిన మొట్టమొదటి వ్యక్తి వాజ్ పేయి అని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. పాకిస్తాన్ కుయుక్తులను తిప్పికొట్టిన ఘనుడని కొనియాడారు.
Also Read: Kishan Reddy: పార్టీ ఫిరాయింపులు జరగలేదని చెప్పడం విచారకరం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఖేల్ మహోత్సవాన్ని విజయవంతం చేయాలి
ఇదిలా ఉండగా ప్రధాని మోడీ పిలుపుతో నిర్వహిస్తున్న సంసద్ ఖేల్ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ ఎస్ వీఐటీ ఆడిటోరియంలో జరిగిన సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం క్యూఆర్ కోడ్, పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. క్రికెట్, కబడ్డీ, ఖో ఖో, వాలీ బాల్, అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయన్నారు. డిసెంబర్ 25 నుంచి జవనరి 10 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ఆయన సూచించారు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 3వరకు పోటీలు కొనసాగుతాయని వివరించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 40 డివిజన్ల వారీగా కమిటీలు వేశామన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని క్రీడాకారులు, పార్టీ నాయకులు, విద్యా సంస్థలు, స్పోర్ట్స్ అసోసియేషన్స్ అందరితో కలిసి సమన్వయం చేసుకోవాలని సూచించారు. క్యూఆర్ కోడ్ ద్వారా అందరూ రిజిస్టర్ చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.
Also Read: Kishan Reddy: మోడీతో ఎంపీల మీటింగ్ అంశం లీక్ చేసినోడు మెంటలోడు.. కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం!

