Anasuya: నటి, టెలివిజన్ యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ నటి కరాటే కళ్యాణి (పాడాల కళ్యాణి) తో పాటు పలు డిజిటల్ మీడియా సంస్థలపై ధ్వజమెత్తారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ అడ్వకేట్ జయంత్ జైసూర్య ద్వారా ఆమె వారికి ఘాటుగా లీగల్ నోటీసులు పంపారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి (Karate Kalyani), అనసూయ వ్యక్తిగత జీవితం, వస్త్రధారణ, కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అనసూయ తన భర్త, పిల్లలతో ఉన్నప్పుడు ధరించే దుస్తుల గురించి, ఆమె నైతికతను ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో కొన్ని మీడియాలకు చెందిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌లో ప్రసారమైన చర్చా కార్యక్రమాల్లో అనసూయను కించపరిచేలా మాట్లాడారని నోటీసులో పేర్కొన్నారు. ‘దండోరా’ ప్రీ రిలీజ్ వేడుకలో శివాజీ మాట్లాడిన మాటలు రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఆ మాటలకు ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ, వివాదం మరింతగా ముదురుతోంది. ఈ క్రమంలో కొన్ని టిబెట్స్ కూడా నడుస్తున్నాయి. ఈ టిబెట్స్‌లో కరాటే కళ్యాణి మాట్లాడిన మాటలపై అనసూయ సీరియస్ అవుతూ నోటీసులు పంపించారు.
Also Read- Karate Kalyani: అనసూయను ‘ఆంటీ’ అని కాకుండా ‘స్వీట్ 16 పాప’ అని పిలవాలా?
నోటీసులోని ముఖ్యాంశాలివే..
వ్యక్తిగత విమర్శలు: అనసూయ వ్యక్తిగత జీవితాన్ని, ఆమె కుటుంబ సభ్యులను (భర్త, కుమారులు) అనవసరంగా బహిరంగ చర్చలోకి లాగడం ద్వారా ఆమెకు మానసిక వేదన కలిగించారని నోటీసులో వివరించారు.
పరువు నష్టం: ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశంతోనే కరాటే కళ్యాణి, ఫిలిం క్రిటిక్ శ్రీకాంత్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారని అడ్వకేట్ పేర్కొన్నారు. ఇది భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 356, 357 కింద నేరమని స్పష్టం చేశారు.
మీడియా బాధ్యత: పరువు నష్టం కలిగించే వీడియోలను ప్రసారం చేయడమే కాకుండా, తప్పుడు థంబ్‌నైల్స్, విజువల్స్ ఉపయోగించి ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు మీడియా సంస్థలను కూడా బాధ్యులను చేశారు.
అనసూయ డిమాండ్లు
అనసూయ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న అన్ని వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ నుండి వెంటనే తొలగించాలి.
బహిరంగంగా ఎటువంటి షరతులు లేని క్షమాపణలు చెప్పాలి.
భవిష్యత్తులో ఆమె వ్యక్తిగత విషయాలపై ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేయబోమని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.
ఈ నోటీసు అందిన 7 రోజుల్లోగా స్పందించకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, భారీ నష్టపరిహారం కోరుతూ కోర్టుకు వెళ్తామని అనసూయ హెచ్చరించారు. ఇప్పటికే నటుడు శివాజీ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినప్పటికీ, కరాటే కళ్యాణి కావాలనే ఈ వివాదాన్ని కొనసాగిస్తున్నారని ఆమె తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ పరిణామం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

