Gajwel – BRS: సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ ఫండ్ పంపకాలపై గందరగోళం
పార్టీ ఇన్‌ఛార్జ్ తన వర్గం వారికే పార్టీ ఫండ్ ఇచ్చుకున్నారంటూ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి అనునాయుల ఆరోపణలు
ఈ గందరగోళంతోనే సర్పంచుల సన్మాన సభ వాయిదా పడ్డట్లు ప్రచారం!
గజ్వేల్, స్వేచ్ఛ: గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీలో (Gajwel – BRS) అసమ్మతి సెగ నివురుగప్పిన నిప్పులా రాజుకుంటోంది. పార్టీలో ఉంటూ పార్టీని ఆగం చేస్తున్న వారికి పగ్గాలు అప్పజెప్పుతున్నారంటూ అధిష్టానం వైఖరిపై కూడా పార్టీలోని కొందరు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం పని చేస్తున్న తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా, నష్టం నింద మాత్రం తనతో పాటు ఇతర నేతలపై మోపడం ఎంతవరకు సమంజసమని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిల మధ్య చోటుచేసుకున్న మనస్పర్థ గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ దుమారానికి దారి తీసింది. సర్పంచ్ ఎన్నికలకు పార్టీ కొంత ఫండ్ ( రూ.2 కోట్లు) ఇచ్చినట్లు స్థానిక బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది ప్రతాప్ రెడ్డి తన వర్గానికి, ఇష్టంవచ్చిన వారికి ఇచ్చినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఫండ్ అందినట్టుగా సమాచారం లేకపోగా, తాను ప్రచారానికి వెళ్లిన గ్రామాలలో నాయకులు, కార్యకర్తలు అడిగిన వారికి పార్టీ ఫండ్ రాలేదని ఎమ్మెల్సీ యాదవ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. అయితే, అందుకువిరుద్దంగా పార్టీ కొంతమందికి ఫండ్ ఇస్తోందనే సమాచారం పార్టీ వర్గాల్లో ఉండడం, ఎమ్మెల్సీకి ఈ సమాచారం లేకపోవడంతో పార్టీలో ఆయన స్థానంపై కార్యకర్తల్లో గుసగుసలు అప్పట్లోనే మొదలైనట్లు ప్రచారం జరిగింది. ఈ సమాచారం యాదవ రెడ్డి వరకు వెళ్లడంతో అధిష్టానాన్ని సంప్రదించారని, అయినా పూర్తి సమాచారం రాకపోవడంతో మౌనం వహించినట్లు తెలిసింది.
Read Also- Odisha Encounter: మరో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేత గణేష్ సహా నలుగురు నక్సల్స్ మృత్యువాత
హరీష్ రావు వద్ద ఎమ్మెల్సీ ఆవేదన!
ఈ నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమాన్ని ఈ నెల 19న నిర్ణయించారని, అయితే, దీనిపై ఎమ్మెల్సీ యాదవ రెడ్డికి సమాచారం లేకుండానే నిర్ణయించడం పట్ల ఆయన మనస్థాపానికి గురయ్యారట. ఇదే విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు వద్ద డాక్టర్ యాదవ రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేసుకున్నట్లు తెలిసింది. తాను సన్మాన సభకు రాబోనని, తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, పార్టీ కోసం నిస్వార్ధంగా పని చేస్తున్నా తనను పక్కకు పెట్టి పార్టీకి వెన్నుపోటు పొడిచే వారికి ప్రాధాన్యత ఇవ్వడంలో అధిష్టానం వైఖరిందో తనకు అర్థం కావడం లేదని ఆయన వాపోయారని సమాచారం. తన సేవలు పార్టీకి అనవసరం అనుకుంటే తనను తప్పుకోమంటే రాజీనామా చేసి పక్కకు ఉంటానని అసహనం వ్యక్తం చేసినట్లు వినికిడి. హరీష్ రావు ఎంత సముదాయించిన సన్మాన సభకు ససేమీరా రాననడంతో అప్పటికప్పుడు సభను రద్దుచేసి వాయిదా వేసినట్లు తెలిసింది.
తనపై బురద చల్లే ప్రయత్నం
తను పార్టీ మారుతా అనడంలో వాస్తవం లేదని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి పేర్కొన్నారు. తన వ్యతిరేకులు తనపై బురదచల్లే ప్రయత్నమేనని తాను పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. పార్టీని వెన్నుపోటు పొడిచే వారిని చూస్తూ ఊరుకున్న వారు కూడా పార్టీకి ద్రోహం చేసిన వారే అవుతారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read Also- Wife Extramarital affair: పెళ్లైన 4 నెలలకే బయటపడ్డ భార్య ఎఫైర్.. ఫ్లెక్సీ వేయించి భర్త న్యాయపోరాటం!

