Telangana BJP: తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధికార ప్రతినిధుల నియామకానికి కసరత్తు ముమ్మరమైంది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధుల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలంగాణలో రాజకీయంగా మరింత దూకుడు పెంచాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. అందుకే తమ వాయిస్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించి కొత్త గొంతుకలను పార్టీ సిద్ధం చేస్తోంది. తన మీడియా విభాగాన్ని ప్రక్షాళన చేయనుంది. రాష్ట్ర అధికార ప్రతినిధుల నియామక ప్రక్రియను పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈసారి నియామకాల్లో సరికొత్త సమతుల్యతను పాటిస్తూ 6:6 రేషియో విధానాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. దీని ప్రకారం పాత టీమ్ లో ఉన్న ఆరుగురికి మళ్లీ అవకాశం దక్కే చాన్స్ ఉందని తెలుస్తోంది. కొత్తగా మరో ఆరుగురికి పార్టీ అవకాశమిచ్చే అవకాశాలున్నాయని సమాచారం.
నియామకంపై కసరత్తు..
ప్రస్తుతం ఉన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులది జంబో టీమ్. ఎన్వీ సుభాష్, కృష్ణసాగర్ రావు, రచన రెడ్డి, రాణి రుద్రమ దేవి, సంగప్ప, పోరెడ్డి కిశోర్ రెడ్డి, కట్టా సుధాకర్ రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి, సీహెచ్ విఠల్, వెంకట్ రెడ్డి, బండారు విజయలక్ష్మి, సునీత, సోలంకి శ్రీనివాస్, వీరేందర్ గౌడ్ ఉన్నారు. కాగా ఇదే టీమ్ కు చెందిన వారిలో కృష్ణ ప్రసాద్ ఏపీ ఎంపీగా కొనసాగుతున్నారు. మరో ఇద్దరు పార్టీ మారారు. అందులో రాకేశ్ రెడ్డి బీఆర్ఎస్ లో, పాల్వాయి రజిని కాంగ్రెస్ లో చేరారు. ఇదిలాఉండగా ఎన్వీ సుభాష్ ను పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్ గా రాష్ట్ర నాయకత్వం ఇటీవల నియమించింది. మిగతావారి నియామకంపై పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న జంబో కమిటీ కంటే మరింత పెద్ద టీమ్ ను ఏర్పాటుచేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు భావించారు.
కేవలం 12 మందితోనే..
ఇందుకు కారణం రాష్ట్ర కమిటీలో బాధ్యతలు దక్కని వారికి ఇందులో చోటు కల్పించి న్యాయం చేయాలని ఆయన భావించి ఇదే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ భారీగా ఉన్న జంబో కమిటీని కుదించాలని హైకమాండ్ స్పష్టంచేసినట్లు తెలిసింది. పెద్ద సంఖ్యలో ప్రతినిధులు ఉండటం వల్ల సమన్వయ లోపం ఏర్పడుతోందని ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. దీంతో ఈసారి కేవలం 12 మందితోనే పరిమితమైన బృందాన్ని ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం.
Also Read: Road Accidents: ఓవైపు క్రిస్మస్ వేడుకలు.. మరోవైపు ఘోర ప్రమాదాలు.. దేశంలో విచిత్ర పరిస్థితి!
జంబో కమిటీని రద్దు చేసి..
జంబో కమిటీని రద్దు చేసి సంఖ్యను 12కు తగ్గించడంతో పాత అధికార ప్రతినిధుల్లో టెన్షన్ మొదలైంది. పనితీరు ఆధారంగానే ఎంపిక ఉంటుందని సంకేతాలు రావడంతో, గతంలో పని చేసిన వారిలో ఆ ఆరుగురు లక్కీ పర్సన్స్ ఎవరనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కొత్త ఆశావహులు తమకు అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉండగా అధికార ప్రతినిధులతో పాటు, వివిధ టీవీ ఛానళ్లలో జరిగే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మరో 10 మంది ప్యానలిస్టులను ప్రత్యేకంగా ఎంపిక చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిత్యం పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ వైఫల్యాలను మీడియా వేదికలపై ఎండగట్టేందుకు నియమించాలని పార్టీ భావిస్తోంది. రాజకీయ పోరాటాలకు అనుగుణంగా బీజేపీ తన అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. మరి ఈ రాష్ట్ర అధికార ప్రతినిధుల జాబితాను ఈనెల 31లోపు ప్రకటిస్తుందా? లేక వచ్చే ఏడాది వెల్లడిస్తుందా? అనేది చూడాలి.

