Sudheer Babu: ఇన్సిడెంట్ ఫ్రీగా న్యూ ఇయర్ వేడుకలు పూర్తయ్యేలా చూడటానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు (Sudheer Babu) చెప్పారు. ఈ క్రమంలో పలు ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలోని బార్లు, రెస్టారెంట్లు, ఫార్మ్ హౌస్ లు, ఈవెంట్లు నిర్వహిస్తున్న ఆర్గనైజర్లతో బుధవారం కమిషనరేట్ లో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేడుకలు పూర్తి కావటానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. ఇక, డిసెంబర్ 31న ట్రాఫిక్, ఎస్వోటీ, షీ టీమ్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులతోపాటు గస్తీ బృందాలు విధుల్లో ఉంటాయని చెప్పారు.
Also Read: Sudheer Babu: మహేష్ సపోర్ట్ తీసుకోలేదు.. సుధీర్ బాబు స్కెచ్ ఏంటి?
ఔట్ డోర్ లో డీజేలకు
ఔట్ డోర్ లో నిర్వహించే ఈవెంట్లలో డీజే బాక్సులకు అనుమతి లేదని కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. బాణాసంచా కాల్చటం నిషిద్ధమన్నారు. పరిమితికి మించిన సంఖ్యలో జనాన్ని ఈవెంట్లలోకి అనుమతించ వద్దని చెప్పారు. మహిళలపై వేధింపులు జరగకుండా షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు జరుపుతాయన్నారు. అదే సమయంలో డ్రగ్స్ వాడకం జరగకుండా ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తాయని చెప్పారు. మైనర్లకు మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈవెంట్లు నిర్వహించే వారు తగిన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు
ప్రతీచోటా సీసీ కెమెరాలను పెట్టాలని చెప్పారు. ఫార్మ్ హౌస్ లలో నిబంధనల ప్రకారమే ఈవెంట్లు జరపాలని చెప్పారు. నిర్ధేశిత సమయం వరకు మాత్రమే బార్లు, వైన్ షాపులను తెరిచి ఉంచాలన్నారు. డిసెంబర్ 31న కమిషనరేట్ పరిధిలో విస్తృత స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు జరుపుతామన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. ఇచ్చిన వారిపై చర్యలు ఉంటాయన్నారు. బైక్ రేసులు జరపవద్దని చెప్పారు. ఇక, డిసెంబర్ 31న రాత్రి సమయంలో అన్ని ఫ్లై ఓవర్లను మూసివేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో కమిషనరేట్ లోని డీసీపీలు పాల్గొన్నారు.
Also Read: Commissioner Sudheer Babu: ప్రజలు కూడా యూనిఫాం లేని పోలీసులే.. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు

