AP Govt: సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Kandula Durgesh (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

AP Govt: సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

AP Govt: తెలంగాణ రాష్ట్రంలో (Telangana State) సినిమా టికెట్ల ధరలు ఇకపై పెంచేది లేదని, దయచేసి సినిమా వాళ్లు ఎవరూ.. ఈ విషయమై మా దగ్గరకు రావద్దని.. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీ కూడా సినిమా టికెట్ల ధరల విషయంలో ఓ ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ (AP Cinematography Minister) చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ, ఇకపై అన్ని సినిమాలకు వర్తించేలా ఒకే సమగ్ర జీవోను తీసుకురావాలని భావిస్తున్నట్లుగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) తెలియజేశారు. బుధవారం సచివాలయంలో జరిగిన సినిమా టికెట్ ధరల హేతుబద్దీకరణ కమిటీ సమీక్షా సమావేశం అనంతరం మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడారు.

ఆ పద్ధతికి స్వస్తి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సినిమా బడ్జెట్‌ను బట్టి విడివిడిగా జీవోలు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలికి, ఒకే విధానం కింద టికెట్ ధరలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ మనుగడ సాగించడంతో పాటు, సామాన్య ప్రేక్షకుడిపై భారం పడకుండా సమతుల్యతను పాటిస్తామని.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని సినీ పరిశ్రమకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పెద్ద బడ్జెట్ సినిమా, ఆర్టిస్టుల రెమ్యూనరేషన్‌‌పై చర్చించి ఒక నిర్ణయానికి వస్తామన్నారు. అన్నిరకాల సినిమాలకు కేటగిరీ ప్రకారం సమానంగా టికెట్ల ధరలు పెంచే విధానం పరిశీలిస్తున్నామన్నారు. త్వరలోనే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Also Read- Anasuya: అతనిది చేతగానితనం.. శివాజీకి అనసూయ స్ట్రాంగ్ కౌంటర్

సినీ పరిశ్రమ సమస్యలకు త్వరలోనే పరిష్కారం

ఇంకా సినీ పరిశ్రమకు ఉన్న సమస్యలు కూడా విని, త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలుగు సినిమా పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ అయిందని, అందువల్ల నిర్మాతలకు బడ్జెట్ విపరీతంగా పెరుగుతోందన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఏపీలో సినిమా టికెట్ల రేట్ల హేతుబద్దీకరణపై ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐ అండ్ పీఆర్ డైరెక్టర్, ఏపీ ఎస్‌ఎఫ్‌టీవీ, టీడీసీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, లా డిపార్ట్ మెంట్ సెక్రటరీ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ సమీక్షా సమావేశం ఇవాళ జరిగిందన్నారు. మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ల టికెట్ ధరల హేతుబద్దీకరణపై, హై బడ్జెట్ సినిమా టికెట్ల పెంపునకు అనుసరించాల్సిన విధానాలపై కమిటీ చర్చించిందన్నారు. సమగ్రంగా చర్చించిన అనంతరం కమిటీ ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుందని వెల్లడించారు.

Also Read- Sivaji: ఆ రెండు అసభ్యకర పదాలకే సారీ.. మిగతా స్టేట్‌మెంట్‌కు కట్టుబడే ఉన్నా..

ఏపీలో చిత్రీకరణ జరపాలి

ఇప్పటివరకు పాత జీవో ప్రకారం హోం శాఖ ద్వారా సినిమా టికెట్ ధరలు పెంచుతున్నామని, ప్రస్తుతం లో-బడ్జెట్, హై బడ్జెట్ సినిమాలకు ఎంత ధర ఉండాలనే అంశంపై ప్రస్తుతం ఏర్పాటైన కమిటీ చర్చిస్తోందన్నారు. అలాగే ఎంత శాతం ఏపీలో చిత్రీకరణ జరపాలన్న అంశంపై కూడా నిబంధనలు నిర్ణయిస్తామన్నారు. షూటింగ్‌లతో పాటు పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిర్ణయాలుంటాయని వెల్లడించారు. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత.. త్వరలోనే కొత్త జీవో జారీ చేస్తామన్నారు. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత నిర్మాతలకు ప్రభుత్వం అండగా ఉండేలా కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాగా, మంత్రితో భేటీ అయిన కమిటీ సభ్యులు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కూచిభొట్ల వివేక్, దర్శకులు జాస్తి ధర్మతేజ, డిస్ట్రిబ్యూటర్ నక్కలపూడి సాయిబాబు, ఎగ్జిబిటర్ సోంపల్లి శివ ప్రసాద్ తదితరులు ఉన్నారు. వీరంతా మంత్రి కందుల దుర్గేష్‌ను సత్కరించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Chiranjeevi: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మార్కెట్‌లోకి వచ్చేశారు..

SS Rajamouli: ‘ఛాంపియన్’కు దర్శకధీరుడి ఆశీస్సులు.. పోస్ట్ వైరల్!

Peddi Song: ‘సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక..’ లిరిక్ గమనించారా? ‘చికిరి’‌కి కూడా నోటీసులు ఇస్తారా?

KTR: ప్రజలు కాంగ్రెస్‌ను బొందపెట్టడం ఖాయం.. జలద్రోహాన్ని ఎండగడతాం..కేటీఆర్ ఫైర్!

Archana Iyer: ‘శంబాల’లో రొమాంటిక్ పాటలు, స్టెప్పులు ఉండవని ముందే చెప్పారు