ACB Raids: ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్న అధికారి అవినీతి పుట్ట పగిలింది. మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్(Deputy Transport Commissioner)గా పని చేస్తున్న మూడ కిషన్ నాయక్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టుగా ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. ఈ క్రమంలో పక్కాగా సమాచారాన్ని సేకరించిన ఏసీబీ అధికారులు 15 బృందాలుగా విడిపోయారు. ఏకకాలంలో హైదరాబాద్ ఓల్డ్ బోయిన్ పల్లి రాజేశ్వరినగర్ లోని కిషన్ నాయక్ నివాసంతోపాటు నిజామాబాద్, సంగారెడ్డి(Sangareddy), రంగారెడ్డి తదితర ప్రాంతాల్లోని అతని బంధుమిత్రుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు.
వ్యవసాయ భూములు
తనిఖీల్లో నిజామాబాద్ లోని లహరి ఇంటర్నేషనల్ హోటల్ లో కిషన్ నాయక్ కు 50శాతం భాగస్వామ్యం ఉన్నట్టుగా పత్రాలు దొరికాయి. దాంతోపాటు నిజామాబాద్ లోనే 3వేల చదరపు గజాల్లో రాయల్ వోక్ ఫర్నీచర్ షాప్, అశోకా టౌన్ షిప్‌లో రెండు ఫ్లాట్లు, సంగారెడ్డి జిల్లా నిజాంపేట తహసీల్దార్ కార్యాలయ పరిధిలో 31 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో మరో 10 ఎకరాల వాణిజ్య భూమి, నిజాంపేట మండలంలో 4వేల చదరపు అడుగుల ఏరియాలో పాలీ హౌస్ ఉన్నట్లుగా పత్రాలు లభ్యమయ్యాయి. బ్యాంకుల్లో 1.37 కోట్ల రూపాయల నగదు ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు దానిని ఫ్రీజ్ చేయించారు.
Also Read: Prabhas Charity: ప్రభాస్ చేసిన పనికి సలాం కొడుతున్న రాజీవ్ కనకాల.. ఎందుకంటే?
డాక్యుమెంట్ల ఆధారంగా..
వంద తులాల బంగారు నగలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక హోండా సిటీ, ఇన్నోవా క్రిస్టా కార్లు ఉన్నట్టు గుర్తించారు. డాక్యుమెంట్ల ఆధారంగా ఆస్తుల విలువ రూ.12.72 కోట్లు ఉంటుందని పేర్కొన్న అధికారులు ప్రైవేట్ మార్కెట్‌లో వీటి విలువ వంద కోట్లకు పైగానే ఉంటుందని చెప్పారు. కిషన్ నాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు చెప్పారు. అవినీతికి అలవాటు పడి అడ్డంగా ఆస్తులు సంపాదించుకున్న అధికారులు, లంచాలు డిమాండ్ చేసే వారి గురించి తెలిస్తే 9440446106 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.
Also Read: Sangareddy District: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో చెలగాటం.. విద్యాశాఖ అధికారులపై ఏఐఎస్ఎఫ్ ఫైర్!

