Male infertility: 1960లలో, భారతదేశపు ఫెర్టిలిటీ రేట్ 5.92గా ఉంది. అంటే, ఓ మహిళ తన జీవితంలో సగటున ఆరు పిల్లలను కనేది. ఇది స్థిర జనాభాను ఉంచేందుకు అవసరమైన “రీప్లేస్‌మెంట్ లెవెల్” కంటే చాలా ఎక్కువ. అయితే, ఈరోజు పరిస్థితి విపరీతంగా మారిపోయింది. 2023 నాటికి, భారతదేశపు ఫెర్టిలిటీ రేట్ 2కు తగ్గిపోయింది, ఇది రీప్లేస్‌మెంట్ లెవెల్ కంటే 0.1 తక్కువ. నిపుణులు చెబుతున్నట్లు, ఈ చిన్న మార్పు కూడా భవిష్యత్తులో జనాభా తగ్గుదలకు దారితీయవచ్చు. జనన రేటు తగ్గడానికి వివిధ కారణాలు ఉన్నప్పటికీ, పిల్లలను కనాలనుకోని దంపతుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు భారతీయుల్లో సంతానలేమి సమస్యలు పెరుగుతోందని డేటా సూచిస్తోంది.
పురుషులలో వంధ్యత – ఒక పెరుగుతున్న సమస్య
పురుషుల్లో వంధ్యత (Male Infertility) ప్రస్తుతం భార్యభర్తలలో 40-50% గర్భధారణ సమస్యలకు కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇది కేవలం 15% మాత్రమే. భారతదేశంలో వంధ్యత ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం జీవనశైలి మార్పులేనని నిపుణులు అంటున్నారు. ఓయాసిస్ ఫెర్టిలిటీ సహ-స్థాపకురాలు డా. దుర్గా జి. రావు దీని గురించి స్పందిస్తూ.. కాలుష్యం, ఆహారంలో కల్తీ పదార్థాలు, మానసిక ఒత్తిడి, సరైన పోషకాహారపు లోపం, నిద్రలేమి, పొల్యూషన్ ఇవన్నీ సంతానలేమికి కారణాలేనని అన్నారు. జిందాల్ IVF సీనియర్ కన్సల్టెంట్ అయిన డా. షీతల్ జిందాల్ మాట్లాడుతూ.. వివాహం ఆలస్యంగా చేసుకోవడం, ఉద్యోగ ఒత్తిడి, ఊబకాయం, పొగ త్రాగడం, మద్యపానం వంటి అనారోగ్యకరమైన అలవాట్లు పురుషుల వీర్య నాణ్యతను ప్రభావితం చేస్తాయి. ఈ కారణంగా 20ల నుండి 40ల మధ్య వయస్సున్న పురుషులలో వీర్య నాణ్యత తగ్గిపోతోంది. దీంతో, వీర్యాన్ని భద్రపరచుకునే అవసరం పెరుగుతోంది.
Male infertility పురుషుల వంధ్యత పెరుగుతుండటంతో “స్పెర్మ్ ఫ్రీజింగ్” ఒక ఉత్తమమైన పరిష్కారంగా మారుతోంది. ఇది భవిష్యత్తులో వీర్యం తక్కువగా మారే ప్రమాదం ఉన్న పురుషులకు, అలాగే వైద్య చికిత్సల (క్యాన్సర్ ట్రీట్మెంట్ వంటి) కారణంగా సంతానం కలిగే అవకాశం కోల్పోయే పురుషులకు ఉపయోగపడుతుంది.
ప్రైమ్ IVF ప్రథమత వైద్యాధికారి డా. నిశీ సింగ్ మాట్లాడుతూ.. క్యాన్సర్ చికిత్సలు, హై-రిస్క్ వృత్తులు, లేదా భవిష్యత్తులో సంతానాన్ని ప్లాన్ చేసుకునే అవసరం ఉన్న పురుషులు వీర్యాన్ని నిల్వ చేసుకోవడం చాలా మంచిదని అన్నారు.
ప్రక్రియ ఎలా ఉంటుంది?
స్పెర్మ్ సేకరణ: సహజసిద్ధమైన విధానంలో లేదా వైద్యపరంగా వీర్యం సేకరిస్తారు.
ప్రాసెసింగ్: ఇందులో అశుద్ధతలను తొలగించి, క్రయోప్రొటెక్టెంట్ అనే రసాయనంతో మిశ్రమం చేస్తారు.
నిల్వ: -196°C తక్కువ ఉష్ణోగ్రత వద్ద వీర్యాన్ని లిక్విడ్ నైట్రోజెన్‌లో భద్రపరుస్తారు. ఇది 20 సంవత్సరాల పాటు నిల్వ ఉంచుకునే అవకాశం ఉంటుంది.
భారతదేశంలో వీర్యం నిల్వ ఖర్చు సుమారు ₹8,000 నుండి ₹10,000 వరకు ఉంటుంది.
పురుషులు వీర్యాన్ని నిల్వ చేసుకోవడం పెరుగుతున్నప్పటికీ, నిబంధనల కారణంగా ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవు. అయితే, నిపుణుల ప్రకారం, ఈ ట్రెండ్ పెరుగుతోంది. డా. సింగ్ మాట్లాడుతూ.. ముఖ్యంగా 20ల నుండి 40ల మధ్య వయస్సున్న పురుషులు, రోగనిరోధక చికిత్సలు తీసుకునేవారు, పొల్యూషన్ ప్రభావిత వాతావరణంలో పనిచేసేవారు వీర్యాన్ని భద్రపరచుకుంటున్నారని అన్నారు.
ఇండియాలో ఇంకా వీర్య భద్రతపై మగవారికి ఒక అపోహ ఉంది. పురుషుల వంధ్యతను పురుషత్వానికి ముప్పుగా”చూడటం, వైద్య సహాయాన్ని కోరే పురుషులకు అడ్డంకిగా మారుతోంది. డా. జిందాల్ దీని గురించి ప్రస్తావిస్తూ.. పురుషుడు సహజంగా పిల్లలను కనగలగాలి అనే భావన సమాజంలో బలంగా ఉంది. ఈ అపోహలు తొలగించాలని అన్నారు.