Google: అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడే ఓ కీలక ఫీచర్‌ను గూగుల్ భారత్‌లో సైలెంట్ గా ప్రారంభించింది. Emergency Location Service (ELS) అని పిలిచే ఈ ఫీచర్ ఇప్పుడు అందర్ని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ప్రమాదం లేదా సంక్షోభ సమయంలో తమ స్థానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ఎంతో సహాయపడనుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం తొలిసారిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమలులోకి వచ్చింది.
గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనే అంతర్భాగంగా ఉన్న ఈ ELS ఫీచర్, ఎవరైనా 112 వంటి అత్యవసర నంబర్‌కు కాల్ లేదా SMS పంపినప్పుడు, ఆ వ్యక్తి ఉన్న లొకేషన్‌ను ఆటోమేటిక్‌గా అత్యవసర సేవలకు పంపిస్తుంది. సంక్షోభ సమయంలో ప్రతి క్షణం కీలకమైనదే కాబట్టి, ఎక్కడికి వెళ్లాలో ముందే తెలిస్తే ప్రాణాలను కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చాలా సందర్భాల్లో ప్రమాదానికి గురైనవారు భయాందోళనలో ఉండటం, గాయపడటం లేదా స్పష్టంగా మాట్లాడలేకపోవడం జరుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో నెట్‌వర్క్ బలహీనంగా ఉండటం వల్ల కాల్ మధ్యలోనే కట్ కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ELS వెంటనే ఖచ్చితమైన లొకేషన్ వివరాలను పంపించి ఈ లోటును భర్తీ చేస్తుంది.
ఈ సిస్టమ్ GPS, Wi-Fi, మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్ సహాయంతో కాల్ చేసిన వ్యక్తి ఉన్న ప్రదేశాన్ని గుర్తిస్తుంది. చాలాసార్లు ఇది 50 మీటర్ల వరకు ఖచ్చితమైన లొకేషన్‌ను అందించగలదు. అంతేకాదు, ఫోన్‌లో ఉపయోగిస్తున్న భాష వంటి అదనపు వివరాలను కూడా షేర్ చేయడం ద్వారా ఎమర్జెన్సీ సిబ్బందికి మెరుగైన అవగాహన కల్పిస్తుంది.
భారత్‌లో ఈ ఫీచర్‌ను పూర్తిగా అమలు చేసిన తొలి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. UP పోలీస్ శాఖ ఈ వ్యవస్థను Pert Telecom Solutions సహకారంతో 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్‌లో కలిపింది. రోజుకు లక్షలాది కాల్స్, మెసేజ్‌లను హ్యాండిల్ చేసే ఈ వ్యవస్థలో ELS కీలక పాత్ర పోషిస్తోంది.
గత కొన్ని నెలలుగా నిర్వహించిన పైలట్ టెస్టింగ్‌లో మంచి ఫలితాలు వచ్చాయని గూగుల్ తెలిపింది. ఈ సమయంలో 2 కోట్లకు పైగా అత్యవసర కాల్స్, మెసేజ్‌లకు లొకేషన్‌ను గుర్తించడంలో ELS సహాయపడింది. కొన్ని సందర్భాల్లో కాల్ పెట్టిన కొన్ని సెకన్లకే డిస్కనెక్ట్ అయినప్పటికీ, లొకేషన్ వివరాలు పంపగలిగిందని గూగుల్ వెల్లడించింది. ELS వెనుక ఉన్న ముఖ్య శక్తి ఆండ్రాయిడ్ మిషన్ లెర్నింగ్ ఆధారిత ఫ్యూజ్డ్ లోకేషన్ సిస్టమ్. ఇది నగరాల్లో, ప్రయాణంలో ఉన్న వాహనాల్లో, లేదా దూరప్రాంతాల్లో ఉన్నా సమర్థవంతంగా పనిచేయగల విధంగా రూపొందించబడింది.
గోప్యత విషయానికి గూగుల్ పెద్దపీట వేసింది. ELS పూర్తిగా ఉచితం, అత్యవసర కాల్ లేదా మెసేజ్ సమయంలో మాత్రమే యాక్టివ్ అవుతుంది. దీనికోసం ఎలాంటి అదనపు యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రత్యేక హార్డ్‌వేర్ కూడా అవసరం లేదు. లొకేషన్ డేటా నేరుగా ఫోన్ నుంచి ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే పంపబడుతుంది, గూగుల్ దాన్ని నిల్వ చేయదు.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 6.0 లేదా అంతకంటే పై వెర్షన్ ఉన్న ఫోన్లలో, ఉత్తరప్రదేశ్‌లో అందుబాటులో ఉంది. రానున్న నెలల్లో మరిన్ని రాష్ట్రాలు ఈ టెక్నాలజీని స్వీకరిస్తాయని, తద్వారా దేశవ్యాప్తంగా అత్యవసర సేవలు మరింత బలపడతాయని గూగుల్ ఆశాభావం వ్యక్తం చేసింది.

