Honey: తేనెలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉంటాయని తెలిసిందే. కానీ ప్రతి సందర్భంలోనూ తేనె ఆరోగ్యానికి మంచిదేనని చెప్పలేం. కొన్ని సందర్భాల్లో, తేనె తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదికాదు. ఇది మేము చెప్పడం కాదు, ప్రముఖ పోషక నిపుణురాలు అంజలి ముఖర్జీ చెబుతున్నారు.
ఎవరికి తేనె మంచిది? ఎవరు తేనెకు దూరంగా ఉండాలి?
అంజలి ముఖర్జీ విశ్లేషణ ప్రకారం.. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ వ్యాయామం చేసేవారైతే వారికి తేనె మంచిది. కానీ జీవనశైలి నెమ్మదిగా ఉండి, వ్యాయామం లేక తినగానే మంచాలకు, కుర్చీలకు అతుక్కుపోయేవారికి తేనె అస్సలు మంచిది కాదు. స్థూలకాయం (ఒబెసిటీ)తో బాధపడేవారు తేనె జోలికి అస్సలు వెళ్లకూడదట.
తేనె ఆరోగ్య ప్రయోజనాలు & దుష్ప్రభావాలు
Honey తేనె హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గాయాలను త్వరగా నయం చేస్తుంది. శక్తివంతమైన యాంటీ-ఇన్ఫ్లమేటరీ ఆహారంగా పనిచేస్తుంది. అయితే.. దీనికి కొన్ని పరిమితులూ ఉన్నాయి. ఒక టీ స్పూన్ తేనె దాదాపు 60 కాలోరీలు అందిస్తుంది. అప్పుడప్పుడూ తేనె తీసుకుంటే బరువు పెరగరు. కానీ రోజూ అధికంగా తేనె తీసుకుంటే, అధిక బరువు, రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదల వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, మీరు ఆరోగ్యంగా ఉంటూ, వ్యాయామం చేస్తూ, స్థూలకాయం లేకుండా ఉంటే, తేనె తీసుకోవచ్చు.
బరువు తగ్గడం vs మెటబాలిక్ ఫిట్‌నెస్
అంజలి ముఖర్జీ మరో ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. బరువు తగ్గడం మాత్రమే ముఖ్యమని అనుకోవడం పొరపాటు.
కొందరు ఎలా ఆలోచిస్తారంటే.. తమకు నచ్చిన దుస్తులు పట్టడం లేదు కాబట్టి బరువు తగ్గాలని అనుకుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఒకవేళ ఇదే ఆలోచనలతో మీరు బరువు తగ్గారని అనుకుందాం. మీకు నచ్చిన దుస్తులు కూడా సరిపోతున్నాయి అనుకుందాం. మరి దుస్తులు సరిపోతున్నాయని తర్వాత వ్యాయామం ఆపేస్తారా? దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. సన్నగా కనిపించడం మాత్రమే కాదు, మెటాబాలిక్‌గా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. బరువు తగ్గాలని అనుకునే ముందు, మీ శరీర కండరభాగం, కొవ్వు శాతం సరిగా ఉన్నాయా లేదా అని పరిశీలించుకోవడం చాలా ముఖ్యం.
లెమన్ హనీ వాటర్
ఈ లెమన్ హనీ వాటర్‌ని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు తెగ వైరల్ చేసేసారు. ఉదయాన్నే పరగడుపున లెమన్ హనీ వాటర్ తాగేస్తే సరిపోతుంది ఆ తర్వాత బరువు తగ్గిపోతారు అని చెప్తున్నారు. అదెలా సాధ్యం? కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి. ఓ యువతి తనకు ఎదురైన అనుభవం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇలా అన్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏదో చెప్పారు కదా అని రోజూ ఉదయం లేవగానే తేనె, నిమ్మరసం తాగారట. అలా కొన్ని నెలల పాటు చేసినా తన బరువులో ఎలాంటి మార్పు రాలేదట. దాంతో ఆమె ఇవన్నీ నమ్మద్దు అని పాపం బాధపడుతూ పోస్ట్ పెట్టారు.
ఎవరో ఏదో చెప్పారని చేసేయడం కాదు. మన రీసెర్చ్ మనం చేసుకోవాలి. అసలు లెమన్ హనీ వాటర్ తాగడం వల్ల బరువు ఎలా తగ్గుతారు అని మీలో ఎంత మంది రీసెర్చ్ చేసారు? ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే.. నిమ్మలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎందులో అయితే యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉంటాయో.. వాటిని తరచూ తీసుకోవడం వల్ల మన మెటబాలిజం మెరుగుపడుతుంది. మన మెటబాలిజం బాగుంటేనే కేలొరీలు కరుగుతాయని చాలా మందికి తెలీదు.
మన జీర్ణ ప్రక్రియ అనేది బాగా పనిచేయాలి. అది బాగుంటేనే మనం తిన్నది శరీరం గ్రహించుకోగలుగుతుంది. ఇందుకు ఉపయోగం పడే పదార్థమే తేనె. తేనె గట్ హెల్త్‌ని పెంచుతుంది. అందుకే మనం తిన్న ఆహారంలో ఏ పోషకాలు ఉన్నా అది మన శరీరం గ్రహించగలుగుతుంది. దీని వల్ల కడుపు ఉబ్బరంగా ఉండదు. లెమన్, హనీ ఒంట్లోని మలినాలను బయటికి పంపించేస్తాయి. జీర్ణ వ్యవస్థ సవ్యంగా, శుభ్రంగా ఉంటేనే బరువు తగ్గేందుకు వీలుంటుంది. అందుకని లెమన్, హనీ వాటర్ తాగడం మంచిది అని చెప్తారు. అంతేకానీ ఉదయం లేవగానే లెమన్ హనీ వాటర్ తాగేసి ఆ తర్వాత ఎంత తిన్నా కూడా బరువు పెరగడం.. కేలొరీలు కరిగిపోతాయి అంటే అది పెద్ద జోక్. లెమన్ హనీ వాటర్ తాగుతూ.. తక్కువ కేలొరీలు ఉన్న పోషకాహారాన్ని తీసుకుంటేనే బరువు తగ్గుతారని గుర్తుంచుకోండి.