Harish Rao: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ – బీఆర్ఎస్ నేతల (Congress Vs BRS) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలకు పలువురు మంత్రులు కౌంటర్లు ఇవ్వగా, వారికి కౌంటర్‌గా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) స్పందించారు. కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ (Congress Party) అని ఆయన ఆరోపించారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా పెడుతున్నది ముమ్మాటికీ హస్తం పార్టీయేనని విమర్శించారు. కృష్ణా నీళ్లలో అతి తక్కువ నీటి వినియోగం జరిగింది రేవంత్ రెడ్డి పాలనలోనే అని అన్నారు.
రేవంత్ పాలనలో ఒక్క ఎకరాకు నీరు ఇచ్చింది లేదని, ఒక్క చెక్ డ్యామ్ కట్టిందీ లేదు, ఒక చెరువు తవ్విందీ లేదు అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఒక్క ప్రాజెక్ట్ కట్టిన పాపానపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ మీరు నీళ్లు గురించి మాట్లాడతారా?. కృష్ణా నది నీళ్లను తాకట్టు పెట్టిందే మీరు. 299 టీఎంసీలను పుట్టించిందే కాంగ్రెస్. దగా చేసిందే కాంగ్రెస్. ఇదివరకు ఎప్పుడూ లేనంతగా రేవంత్ పాలనలో కృష్ణా నీరు అతితక్కువ వినియోగం జరిగింది. ఉన్నా ఒప్పందాన్ని కూడా వాడుకోకుండా ఆంధ్రప్రదేశ్ అడుగులకు మడుగులు ఒత్తి, దాసోహం అయ్యారు. తెలంగాణకు, పాలమూరుకు అన్యాయం చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి అయి రెండేళ్లు అయినా, ఇంకా ప్రిపేర్ అవ్వలేదని అంటుంటారని, సగం సగం ప్రెస్‌మీట్లు పెట్టి రాష్ట్ర పరువు తీస్తున్నారని హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే బాధపడతారేమో గానీ, ప్రిపేర్ కాకుండా ప్రెస్‌మీట్లు ఏంది?. ఎనకటకి కేసీఆర్ అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెడితే, ప్రిపేర్ కాలేదని చెప్పి అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు నీటి పారుదల శాఖ మంత్రి అయ్యి రెండేళ్లు అయ్యింది. ఇప్పుడైనా ప్రిపేర్ అయ్యి రా. ఆ ప్రెస్‌మీట్లు ఏంది?, ప్రిపేర్ కాకుండా ప్రెస్‌మీట్లకు వస్తే నీ పరువు, ప్రభుత్వం పరువు, మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం పరువుపోతుంది’’ అని హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Read Also- Narasimha Re-release: తన ఐకానిక్ పాత్ర నీలాంబరిని చూసి తెగ మురిసిపోతున్న రమ్యకృష్ణ..
కేసీఆర్‌కు కాంగ్రెస్ కౌంటర్లు
కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్‌గా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఆదివారం నాడు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రులు ఇవాళ (సోమవారం) స్ట్రాంగ్ కౌంటర్లు (Congress Counters KCR) ఇచ్చారు. తోలు తీస్తామంటూ కేసీఆర్ చేసిన హెచ్చరికపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, ఆల్రెడీ ప్రజలు తమరి తోలు తీస్తూనే ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ డీపీఆర్ తొమ్మిదేళ్ల తర్వాత ఎందుకు వెనక్కి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ వస్తే అసెంబ్లీని మరింత హుందాగా నడుపుకుందామంటూ మంత్రి పొన్నం సూచన చేశారు. ఒక రాజకీయ పార్టీగా ఆ బాధ్యత ఉందని ఆయన అన్నారు. ‘‘శాసనసభకు హాజరై ప్రజా సమస్యలపై మాట్లాడండి. తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్‌పై మాకు గౌరవం ఉంది’’ అని అన్నారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని ఆయన ఆరోపించారు. పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తూ రాష్ట్రానికి మొండిచేయి చూపుతోందని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఆఫీస్‌కు తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పామని, అంతేగానీ, తోలుతీస్తామంటే తీయించుకునేందుకు ఇక్కడెవరూ సిద్ధంగా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

