Apple India: భారతదేశంలో ఆపిల్ తయారీ రంగం మరో పెద్ద మైలురాయిని చేరుకుంది. బెంగళూరు దగ్గర కొత్తగా ఏర్పాటు చేసిన ఐఫోన్ అసెంబ్లీ ఫ్యాక్టరీలో కేవలం 8–9 నెలల వ్యవధిలోనే దాదాపు 30 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ఇది ఇప్పటివరకు భారత్‌లో ఏ ఫ్యాక్టరీలోనూ జరగని రీతిలో అత్యంత వేగంగా జరిగిన నియామకం అని పలు నివేదికలు వెల్లడించాయి.
దీనిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. ఈ ఉద్యోగుల్లో దాదాపు 80 శాతం మంది యువతులే. చాలామందికి ఇదే మొదటి ఫార్మల్ ఉద్యోగం. బెంగళూరు అవుట్‌స్కర్ట్స్‌లోని దేవనహళ్లి ప్రాంతంలో ఉన్న ఈ ఫ్యాక్టరీని ఆపిల్‌కు పెద్ద తయారీ భాగస్వామి అయిన ఫాక్స్‌కాన్ (Foxconn) నిర్వహిస్తోంది. సుమారు 300 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్లాంట్‌లో మొదట ఐఫోన్ 16 మోడళ్ల ట్రయల్ ప్రొడక్షన్ జరిగింది. ఇప్పుడు తాజాగా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కూడా ఇక్కడే తయారవుతోంది.
ఈ ఫ్యాక్టరీలో తయారవుతున్న ఫోన్లలో 80 శాతం పైగా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అంటే ఆపిల్ గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్‌కు ఎంత ప్రాధాన్యం పెరిగిందో అర్థమవుతోంది. వచ్చే ఏడాదికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి మొదలైతే, ఇక్కడ పని చేసే ఉద్యోగుల సంఖ్య 50 వేల వరకు చేరే అవకాశం ఉందని సమాచారం. అలా అయితే ఇది దేశంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీలలో ఒకటిగా మారనుంది.
ఇక్కడ పనిచేస్తున్న యువతుల వయసు ఎక్కువగా 19 నుంచి 24 ఏళ్ల మధ్య ఉంటుంది. ఇంటర్, పాలిటెక్నిక్ చదివిన అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు. కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ల కోసం ఫాక్స్‌కాన్ ఇప్పటికే ఆరు పెద్ద హాస్టళ్లు నిర్మించింది. ఉండటానికి చోటు, తక్కువ ధరకు భోజనం ఇలా అన్ని ఫ్రీ సదుపాయాలే. సగటున నెలకు రూ.18,000 వరకు జీతం వస్తోంది. బ్లూ-కాలర్ ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు ఇది మంచి వేతనమేనని తెలిపింది.
భవిష్యత్తులో ఈ దేవనహళ్లి క్యాంపస్‌ను చిన్న పట్టణంలా తయారు చేయాలనే ప్లాన్ ఉంది. ఇళ్లు, హాస్పిటల్, స్కూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లు అన్నీ అక్కడే ఉండేలా డెవలప్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ ఫ్లోర్ మాత్రమే దాదాపు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇప్పుడున్న నాలుగు లైన్లు క్రమంగా పెరిగి, చివరకు పన్నెండు వరకు చేరే అవకాశం ఉంది.
ఈ బెంగళూరు ప్రాజెక్ట్ కోసం ఫాక్స్‌కాన్ సుమారు రూ.20 వేల కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఇది ఇప్పటికే తమిళనాడులో ఉన్న ఆపిల్ ఐఫోన్ ఫ్యాక్టరీ (అక్కడ 41 వేల మంది పనిచేస్తున్నారు) కంటే కూడా పెద్దదిగా మారనుంది. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ ఫ్యాక్టరీని భారత్ మేక్ ఇన్ ఇండియా, పీఎల్ఐ స్కీమ్‌లకు పెద్ద విజయం అంటూ అభివర్ణిస్తున్నారు.
చైనా నుంచి క్రమంగా తయారీని బయటకు తీసుకువస్తున్న ఆపిల్‌కు ఇప్పుడు భారతదేశం కీలక కేంద్రంగా మారింది. ఇప్పుడు అన్ని ఐఫోన్ మోడళ్లూ మొదటినుంచే భారత్‌లో తయారవుతూ, ప్రపంచమంతా ఎగుమతి అవుతున్నాయి. కొన్ని ఏళ్ల క్రితం వరకు ఊహించలేని స్థాయిలో ఇది పెద్ద మార్పు.

