Congress Counters KCR: కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్‌గా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఆదివారం నాడు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రులు ఇవాళ (సోమవారం) స్ట్రాంగ్ కౌంటర్లు (Congress Counters KCR) ఇచ్చారు. తోలు తీస్తామంటూ కేసీఆర్ చేసిన హెచ్చరికపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, ఆల్రెడీ ప్రజలు తమరి తోలు తీస్తూనే ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ డీపీఆర్ తొమ్మిదేళ్ల తర్వాత ఎందుకు వెనక్కి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ వస్తే అసెంబ్లీని మరింత హుందాగా నడుపుకుందామంటూ మంత్రి పొన్నం సూచన చేశారు. ఒక రాజకీయ పార్టీగా ఆ బాధ్యత ఉందని ఆయన అన్నారు. ‘‘శాసనసభకు హాజరై ప్రజా సమస్యలపై మాట్లాడండి. తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్‌పై మాకు గౌరవం ఉంది’’ అని అన్నారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని ఆయన ఆరోపించారు. పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తూ రాష్ట్రానికి మొండిచేయి చూపుతోందని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఆఫీస్‌కు తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పామని, అంతేగానీ, తోలుతీస్తామంటే తీయించుకునేందుకు ఇక్కడెవరూ సిద్ధంగా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్‌కే తోలు మాత్రమే మిగిలింది: మంత్రి జూపల్లి
మంత్రి జూపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. ‘‘299 టీఎంసీలు చాలు అని ఆనాడు కేసీఆర్ ఎలా సంతకం పెట్టాడు?. కృష్ణా గోదావరి జాలాలపై సభలో చర్చకు సిద్ధమా?’’ అని మంత్రి నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తర్వాత స్పందించి, తోలుతీస్తానంటూ కేసీఆర్ అంటున్నారని, ఆ పార్టీకి కండలు కరిగి కేవలం తోలు మాత్రమే మిగిలిందని మంత్రి జూపల్లి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీఆర్‌ఎస్ పార్టీ బలహీనమైందని, కేసీఆర్‌కు అర్థమైందని, పార్టీ ప్రతిష్ట కాపాడుకోవాలనే విషయం తెలిసొచ్చిందని అన్నారు. ఈ మేరకు గాంధీభవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు.
పాలమూరు ప్రాజెక్టు సమస్య గురించి మాట్లాడడం కేసీఆర్ ఉద్దేశం కాదని, కేవలం పార్టీని కాపాడుకోవాలనే ఆలోచనతోనే కేసీఆర్ బయటకు వచ్చారని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ వద్ద కుర్చీ వేసుకుని మరీ పూర్తిచేస్తానంటూ కేసీఆర్ గతంలో ప్రగల్భాలు పలికారని, పదేళ్లు పాలించి కనీసం ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని అన్నారు. ఏకంగా రూ.8 లక్షల కోట్ల అప్పు చేసినా ఫలితం సున్నా అని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.
ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదు: మంత్రి ఉత్తమ్
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ హయాంలో రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టినా, కనీసం ఒక్క ఎకరానికీ కూడా నీళ్లివ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, రూ.7 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన మీడియాతో అన్నారు.

