KCR BRS LP: తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్న బీఆర్ఎస్ ఎల్పీ (BRS LP), రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం (KCR BRS LP) మొదలైంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన, తెలంగాణ భవన్ వేదికగా జరుగుతోంది. ఈ భేటీలో కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఈ విషయం తేటతెల్లమయ్యిందని ఆయన పేర్కొన్నారట.
‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నన్ను తిట్టడమే పనిగా పెట్టుకుంది. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. ప్రజలకు అర్థం అయింది. పాలు ఏవి, నీళ్లు ఏవి అనేది ప్రజలు తెలుసుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసుకోవాలి. రాబోయేది మనమే’’ అని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.
Read Also- Brahmani Birthday: హీరో నిఖిల్‌తో కలిసి సరదాగా క్రికెట్ ఆడిన నారా బ్రాహ్మణి
సాయంత్రం 6 గంటలకు ప్రెస్‌మీట్
బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ముగిసిన తర్వాత, సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మీటింగ్‌లో మాట్లాడుకున్న అంశాలను ఆయన మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
జలకుట్రలు జరుగుతున్నాయంటూ కేసీఆర్ విమర్శలు చేసే అవకాశం ఉంది. పచ్చగున్న తెలంగాణను దోచుకోవడానికి జల వాటాలపై గురుశిష్యులు, బడేభాయ్, చోటేభాయ్ రూపంలో మళ్లీ కుట్రలు మొదలయ్యాయంటూ బీఆర్ఎస్ పార్టీ ఆదివారం ఉదయం ఎక్స్ ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. దీనినిబట్టి చూస్తే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలను ముడిపెట్టి, తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కేసీఆర్ ఆరోపించే సూచనలు కనిపిస్తున్నాయి. ‘‘మన తెలంగాణ నీళ్లను తరలించుకుపోవడానికి దొంగలంతా ఒక్కటయ్యారు. నాడు అరవై ఏండ్ల ఉమ్మడి పాలకుల కుట్రలకు బలైన అన్నదాతల కన్నీళ్లు తుడిచిన కేసీఆర్.. రైతుల కోసం, తెలంగాణ నీళ్ల కోసం నేడు మళ్లీ మరో జలపోరాటానికి సిద్ధం అయ్యాడు. కేంద్రంలోని బీజేపీ, ఆ కూటమి చేసే కనుసైగలకు జీ హుజూర్ అంటూ తలొగ్గిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మరో జలసాధన ఉద్యమం తథ్యం’’ అని ఆ పోస్టులో బీఆర్ఎస్ రాసుకొచ్చింది. దీనిని బట్టి, సాయంత్రం ఏం మాట్లాడబోతున్నారనేది ఒకే సంకేతంగా భావించవచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కాగా, బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ భవన్‌కు కేసీఆర్ చేరుకున్నప్పుడు పార్టీ శ్రేణులకు ఆయన ఘనస్వాగతం పలికాయి.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రారంభమైన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం
ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మరియు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. pic.twitter.com/D75oKGFuQ3
— BRS Party (@BRSparty) December 21, 2025

