CM Revanth Reddy: తెలంగాణలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి మిశ్రమ అనుభూతిని మిగిల్చాయి. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ, ఆశించిన స్థాయి విజయం దక్కకపోవడానికి రెబల్స్ ప్రధాన కారణమని పార్టీ అధిష్టానం గుర్తించింది. ఉత్కంఠభరితంగా సాగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. పార్టీ అధికారికంగా బలపరిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా రంగంలోకి దిగిన రెబల్స్ వల్ల అనేక పంచాయతీల్లో పార్టీకి గట్టి నష్టం వాటిల్లిన్నట్లు గుర్తించారు. ఈ పరిణామాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాధారణంగా అసంతృప్తి నేతలను బుజ్జగించడం సులభం. కానీ, ఈ ఎన్నికల్లో అది సాధ్యపడలేదని సీఎం ఆయా జిల్లాల డీసీసీలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పైగా క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్న నేతలను కాదని, కొందరు ఎమ్మెల్యేలు తమ అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వడం రెబలిజానికి దారితీసినట్లు సీఎం గుర్తించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు, నియోజకవర్గ సమన్వయకర్తలు రెబల్స్‌ను ముందే గుర్తించి వారితో మాట్లాడటంలో విఫలమైనట్లు సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం శనివారం రివ్యూ చేశారు.
అందుకే ప్రతిపక్షాలకు లాభం
రెబల్ అభ్యర్థులు బరిలో ఉండటం వల్ల ఓట్లు చీలిపోయి, ప్రతిపక్షాలకు లాభం చేకూరినట్లు సీఎం స్టడీలో తేలింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని కీలక పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఓటమి పాలవడంపై సీఎం తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పవర్‌లోకి రావడానికి కారణమైన ఈ జిల్లాల్లో ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇవ్వడంపై సీఎం గుర్రుగా ఉన్నారు. రెబల్‌గా పోటీ చేసిన వారు, వారికి సహకరించిన నాయకుల పూర్తి వివరాలను పంపాలని అన్ని జిల్లాల డీసీసీలకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే 6 ఏళ్ల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేయాలని గాంధీభవన్ యోచిస్తున్నట్లు సమాచారం. మరో వైపు కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ధారణకు వచ్చారు. సొంత ఊరిలోనే పార్టీ మద్దతు దారులను గెలిపించుకోలేక పోయిన ఎమ్మెల్యేల పై సీఎం ప్రత్యేక నిఘా పెట్టారు.
Also Read: Bigg Boss9 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసిన ‘ది రాజాసాబ్’ హీరోయిన్.. హారర్ర్ ఎవరంటే?
గెలిచిన రెబల్స్‌ను పార్టీలో చేర్చుకోవాలా వద్దా?
ఇక రెబల్‌గా పోటీ చేసి గెలిచిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలా వద్దా అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. గెలిచిన స్వతంత్రులను చేర్చుకునే ముందు స్థానిక మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల ఆమోదం తప్పనిసరి అంటూ సూచించారు. క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు.ఈ ఎన్నికల ఫలితాలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఒక హెచ్చరిక లాంటివని. ఇప్పటికైనా సమన్వయ లోపాన్ని సరి దిద్దుకోకపోతే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ఊపును కొనసాగించడం కష్టమని సీఎం అన్ని జిల్లాల లీడర్లకు వార్నింగ్ ఇచ్చారు.
Also Read: KTR: ‘సీఎం రేవంత్‌ను ఫుట్ బాల్ ఆడుకుంటా’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

