Health Tips: ఒకప్పుడు ఎలా ఉన్నారండీ.. ఆరోగ్యం బాగానే ఉందా అని అడిగితే.. అంతా బాగానే ఉందండి అనేవారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎలా ఉన్నారని పలకరిస్తే.. చిన్న పిల్లలు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య ఉందని చెప్తున్న రోజులివి. మారుతున్న జీవన శైలి, మంచి ఆహారం లేకపోవడం.. తవ్ర ఒత్తడికి గురవడమే దీనికి కారణం. 30, 35 ఏళ్ల వయసు వారికి ఉన్న ఓపిక ఇప్పుడిప్పుడు పిల్లలకు లేదంటే నమ్ముతారా? కానీ ఇది అక్షరాలా నిజం. మనం తినే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. అన్నీ బాగానే తింటున్నా.. మంచిగా రోజూ వ్యాయామం చేస్తున్న వారికీ లేనిపోని రోగాలు వస్తున్న రోజులివి. తిన్నా తినకపోయినా ఎప్పుడో ఒకప్పుడు పోయేదానికి డైటింగ్‌ల పేరుతో ఎందుకు ఆకలిని చంపుకోవాలి అని చాలా మంది అంటుంటారు. అది నిజమే కానీ.. మనం బతికున్నంత వరకు ఇతరులపై ఆధారపడకుండా ఉండాలంటే మనం కచ్చితంగా ఆరోగ్యంగా ఉండి తీరాల్సిందే.
మన జీవితంలో అలవర్చుకునే చిన్న చిన్న మార్పులే ముందు ముందు మనకు తెలీకుండానే మంచి ఫలితాలను ఇస్తాయి. మీ ఆరోగ్యం మెరుగుపడాలన్నా.. అందమైన చర్మం మీ సొంతం కావాలన్నా ఈ చిన్న పనిని అలవాటుగా చేసుకోండి. అదేంటంటే.. రోజూ ఉదయం లేవగానే ఒక గ్లాసు జ్యూస్. నిజానికి పండ్లు నేరుగా తింటేనే అందులోని విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థం ఒంటికి బాగా పడుతుంది. మరి జ్యూస్ తాగాల్సిన అవసరం ఏంటి అంటారా? జ్యూస్‌ని మంచి నీళ్లుగా తాగేస్తే దాని నుంచి ఎలాంటి పోషకాలు అందవు. ఏదైనా పండ్ల రసం లేదా ఆకుకూరలను రసం చేసుకుని తాగాలనుకుంటే ప్రతి చుక్కను నోట్లోని లాలాజలంతో ఊరనివ్వాలి. అప్పుడే దానిలోని పోషకాలు ఒంటికి పడతాయి. ఒక పండుని మనం ఒక ఐదు నిమిషాల పాటు తింటే.. జ్యూస్‌ని ఒక పది నిమిషాల పాటు తాగాలి. అదే అందులో ఉండే మ్యాజిక్. మీకు ఉదయాన్నే పండ్లు తినాలన్న ఆసక్తి లేకపోతే.. ఈ టాప్్ 5 బెస్ట్ జ్యూస్‌లను ప్రయత్నించి చూడండి. (Health Tips)
క్యారెట్ రసం
చాలా మందికి క్యారెట్ కొరికి నమిలి తినడం అంటే నచ్చదు. అదే జ్యూస్ చేసి ఇస్తే నిమిషంలో తాగేస్తారు. మీరు కూడా ఈ కోవకే చెందుతారా? అయితే మీరు తాగే ఈ క్యారెట్ జ్యూస్‌ని నిమిషంలో కాకుండా నెమ్మదిగా.. కొద్ది కొద్దిగా ఆస్వాదిస్తూ తాగి చూడండి. దానిలోని పోషకాలన్నీ అందుతాయి. ఫలితం మీకే తెలుస్తుంది.
టొమాటో రసం
ఇందులో బీటా కెరోటిన్, లైపో ప్రొటీన్ అధికంగా ఉంటాయి. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. యూవీ కిరణాల వల్ల చర్మంపై నల్లటి మచ్చలు రావడం.. సన్ బర్న్ అవ్వడం వంటివి జరుగుతుంటాయి. సన్‌స్క్రీన్ రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి కానీ.. అది కేవలం బయటి నుంచి మాత్రమే చర్మాన్ని రక్షిస్తుంది. మరి లోపల నుంచి కూడా ఆ రక్షణ కావాలి కదా. ఈ సమస్యకి టొమాటో రసం బెస్ట్.
బీట్రూట్ రసం
రక్త హీనతతో బాధపడుతున్న వారికి బీట్ రూట్ రసం అనేది ఓ వరం లాంటిదనే చెప్పాలి. రక్తాన్ని పెంచడంతో పాటు చర్మాన్ని కూడా నిగనిగలాడేలా చేస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. బీట్రూట్ రసం వారంలో రెండు మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది. రోజూ అవసరం లేదు. హెమొగ్లోబిన్ బాగానే ఉన్నవారు వారంలో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. బీట్రూట్ రసం తాగినప్పుడు మూత్రం లేత ఎరుపు రంగులో వస్తుంది. అది సహజమే. దానిని చూసి భయపడాల్సిన అవసరం లేదు.
దానిమ్మ రసం
విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, అమైనో యాసిడ్స్ పుష్కలంగా దానిమ్మలో ఉంటాయి. నేరుగా తినడం ఇష్టం లేని వారు జ్యూస్ చేసుకుని తాగేయండి. దానిమ్మ రోజూ తీసుకున్నా కూడా మంచిదే.
కీరా రసం
ఇది చలికాలమే అయినప్పటికీ అప్పుడే వేసవి మొదలైపోయిందా అన్నట్లు ఉంది వాతావరణం. విపరీతంగా వేడి, ఉక్కపోత ఉంటున్నట్లు మీకు అనిపిస్తే వారంలో మూడు సార్లు కీరా రసం తాగి చూడండి. శరీరం చల్లబడుతుంది. ఒంట్లో ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది.
పైన చెప్పిన జ్యూస్‌లే కాదు.. ఏ పండు నుంచి జ్యూస్ తీసినా కూడా వాటిని కోల్డ్ ప్రెస్డ్ పద్ధతిలో చేసుకుని మాత్రమే తాగాలి. నీళ్లు, చెక్కెర కలుపుకుని తాగితే ఫలితం ఉండదు అని మాత్రం తెలుసుకోవాలి.