Leopard in Naravaripalli: ఇటీవల ఏపీలోని పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా, అలాంటి ఘటన మరొకటి నమోదయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇంటికి సమీపంలోనే చిరుత సంచరించడం (Leopard in Naravaripalli) కలకలం రేపింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె గ్రామ సమీపంలో చిరుతపులి సంచారాన్ని గుర్తించారు. చంద్రబాబు సొంత ఊరు కావడంతో పాటు, ఆయన నివాసానికి సమీపంలోనే ఈ వన్యప్రాణి కనిపించడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు.
నెమళ్ల వేట కోసం చిరుతల ఈ విధంగా జనావాసాల వైపు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. శేషాచల అడవులకు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా చిరుత కలకలం రేపుతోందని స్థానికులు అంటున్నారు. గ్రామంలో పెద్ద సంఖ్యలో ఉండే నెమళ్లను వేటాడేందుకు చిరుతు వస్తోందని అంటున్నారు. పంట పొలాల్లోకి వెళ్లాలంటే భయమేస్తోందని అంటున్నారు.
దూరంగా పారదోలే ప్రయత్నం
జనావాసాలకు సమీపంలోకి రావడంతో, సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. జనావాసాల వైపు రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. చిరుతను బెదరగొట్టి అడవి లోపలికి వెళ్లేలా పెద్ద పెద్ద శబ్దాలు చేశారు. అలాగే, బాణాసంచా కూడా కాల్చారు.

