Harish Rao: దేశం వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా వెళ్తున్నదని బహుశా మరో ఆరు నెలల్లోనో, ఏడాదిలోనో ఎన్నికలు రావచ్చు అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయని, ప్రజల తీర్పు చూసి షాక్ తగిలిందని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం మల్కాపూర్, కోనైపల్లి, నర్సంపల్లి గ్రామాల్లో గెలిచిన సర్పంచులు, అలాగే అచ్చంపేట నియోజకవర్గం, వంగూరులోని 10 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచులు బుధవారం హైదరాబాద్‌లో హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. సర్పంచులను అభినందించి శాలువాలతో సత్కరించిన అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ, మొదటి దఫా ఫలితాలు చూసి కాంగ్రెస్ నేతలు షాక్ అయ్యారని, రెండో దఫాతో మైండ్ బ్లాక్ అయ్యిందని ఎద్దేవా చేశారు.
ఓటమి భయంతోనే ఇప్పుడు డబ్బు సంచులు
మూడో దశ ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీకి నిరాశను మిగిల్చిందని అన్నారు. ఈ ఓటమి భయంతోనే ఇప్పుడు డబ్బు సంచులు పట్టుకొని హైదరాబాద్ నుండి బయలుదేరారని అన్నారు. పోలీసులను అడ్డు పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో తూప్రాన్ మండలమే కాదు రాష్ట్రం మొత్తం అద్భుతంగా అభివృద్ధి చెందిందని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, నాడు ఢిల్లీలో అవార్డులు ఇస్తే తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా జాబితా ఉండేది కాదని వివరించారు. కానీ, ఇప్పుడు ఒక్క అవార్డు కూడా రాలేదని ఆరోపించారు. పల్లెలు అపరిశుభ్రంగా మారాయని, కనీసం కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.
Also Read: Harish Rao: రేవంత్ పాలనలో పల్లెలకు అవార్డులు అభివృద్ధి బంద్!: హరీష్ రావు
మా కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు
ఆనాడు కేసీఆర్ ప్రతి నెలా పల్లెలకు నిధులు విడుదల చేసేవారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు బంద్ అయ్యాయన్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంపు యార్డులు అన్నీ మూలకు పడ్డాయని ఆరోపించారు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. ‘‘కాంగ్రెస్ నాయకులను నేను హెచ్చరిస్తున్నా. మా కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు’’ అని హరీశ్ రావు హెచ్చరించారు. దాడులు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. బీఆర్ఎస్‌లో గెలిచిన వారిని బలవంతంగా పార్టీలో చేర్చుకోవాలని చూసినా కుదరదని, ఎందుకంటే తమ కార్యకర్తలు ఉద్యమకారులని గుర్తుంచుకోవాలన్నారు. మీ బెదిరింపులకు లొంగరని స్పష్టం చేశారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. గెలిచిన సర్పంచులంతా ధైర్యంగా ఉండాలన్నారు.
ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చ
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చ అని, రాహుల్ గాంధీ “సేవ్ ది కానిస్టిట్యూషన్” నినాదం, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుతో నేడు పూర్తిగా బహిర్గతమైనదని, రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను కూడా దిగజార్చడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని హరీశ్ రావు అన్నారు. బుధవారం ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య సూత్రాలను తీవ్రంగా దెబ్బతీసిన ఈ ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన యాంటీ డిఫెక్షన్ నియమాలను పూర్తిగా పక్కన పెట్టి, అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగాన్ని కాలరాయడమేనని అని అన్నారు. ఢిల్లీలో రాజ్యాంగ నైతికతపై గొప్ప ఉపన్యాసాలు ఇస్తూ, తెలంగాణలో మాత్రం అదే రాజ్యాంగాన్ని నిర్లజ్జగా ధిక్కరించడం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీల నిజస్వరూపమని మండిపడ్డారు.
Also Read: Harish Rao: కాంగ్రెస్ హింసా రాజకీయాలను అడ్డుకుంటాం : మాజీ మంత్రి హరీష్ రావు

