Defection MLAs: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విషయంలో తెలంగాణ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇచ్చారు. పార్టీ ఫిరాయించినట్లు స్పష్టమైన ఆధారాలు లేనందున ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. దీంతో అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులకు ఊరట లభించినట్లైంది. వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే తాను గుర్తిస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనిపై స్పీకర్ కు గతంలోనే ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా సాగదీస్తుండటంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. జులై 31న స్పందిస్తూ స్పీకర్ విచక్షణాధికారాల్లో తాము కలుగచేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. అయితే విచారణ సాగదీతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల్లోగా అనర్హత వేటు అంశాన్ని తేల్చాలని ఆదేశించింది. అయితే గత నెలలోనే ఆ గడువు ముగియగా.. అప్పటికీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో నవంబర్ 17న సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు దిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నాలుగు వారాల్లో విచారణ తేల్చాలని స్పీకర్ కు మరో అవకాశం ఇచ్చింది.
Also Read: Bhumana Karunakar Reddy: శ్రీవారికి చంద్రబాబు ద్రోహం.. రూ.3 వేల కోట్లు దోచిపెట్టారు.. టీటీడీ మాజీ చైర్మన్
దీంతో డిసెంబర్ 17లోగా ఏదోక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లలో 8 మందికి సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ పూర్తి చేశారు. అందులో ఐదుగురికి క్లీన్ చీట్ ఇస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు చూపలేకపోయారని స్పీకర్ పేర్కొన్నారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. విచారణ పూర్తి చేసుకున్న మిగిలిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్ కు సంబంధించి గురువారం స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. మరోవైపు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి ఇంకా విచారణ పూర్తి కాలేదు. కాగా ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టులో ఈనెల 19న మరోమారు విచారణకు జరగనుంది.

