Dr Gopi: యూరియా పంపిణీని ఒకే వద్ద కాకుండా డి-సెంట్రలైజ్డ్ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి (Dr Gopi) తెలిపారు. హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన, వ్యవసాయంలో శాస్త్ర సాంకేతికతను జోడించాలని అన్నారు. యూరియా పంపిణీ కోసం త్వరలోనే ప్రత్యేక యాప్ రాబోతోందని, ఇప్పటికే వాట్సప్ ఛానల్ ద్వారా రైతులకు సమాచారం ఇస్తున్నామని డైరెక్టర్ చెప్పారు.
10 వేల పంపిణీ కేంద్రాలను కూడా పెంచే ప్రయత్నం
యూరియా కొనుగోలులో ఈపాస్ సిస్టమ్, ల్యాండ్ రికార్డ్ ఆధారంగా సరఫరా చేయడం ద్వారా పక్కదారి పట్టకుండా కఠిన ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు.ఈ యాప్‌ను నిక్ తయారు చేసిందని, దీని నిర్వహణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 10 వేల పంపిణీ కేంద్రాలను కూడా పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. రైతులు తమ సెల్ నంబర్, పట్టాదార్ పాస్ బుక్ ఉంటే చాలు, ఇంటి వద్ద నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చు. తమ జిల్లా, మండలంలో ఎన్ని యూరియా బస్తాలు ఉన్నాయో కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
Also Read: Ramachandra Rao: త్వరలో కమలం బహిరంగ సభ.. బీజేపీ స్టేట్ చీఫ్ కసరత్తు
వారికి కూడా తీపి కబురు
కౌలు రైతులు కూడా ఆధార్, పేరుతోపాటు పట్టాదార్ పాస్ బుక్ ఎంట్రీ చేసి యూరియా బుక్ చేసుకొని తీసుకోవచ్చని, అయితే ల్యాండ్ ఓనర్‌కు వచ్చే ఓటీపీని వారు నమోదు చేయాల్సి ఉంటుందని వివరించారు. చిన్న, సన్నకారు రైతులకు ఒకే విడతలో, పెద్ద రైతులకు మాత్రం ఒకేసారి అధిక మొత్తంలో తీసుకెళ్లే ఇబ్బంది లేకుండా, నెల రోజుల్లో మూడు విడతల్లో యూరియా అందిస్తామని గోపి స్పష్టం చేశారు. డీలర్లు కూడా బుకింగ్ ఆధారంగానే యూరియా అమ్మకాలు చేపట్టాలని ఆదేశించారు. యాప్ ద్వారా బుకింగ్ చేసిన ఐడీ 24 గంటల పాటు పనిచేస్తుందని, ఆ గడువులోపు రాకుంటే మరోసారి బుక్ చేసుకోవాలని తెలిపారు. గత సీజన్‌లో ఏర్పడిన యూరియా కొరతకు రామగుండం నుంచి, కేంద్రం నుంచి సకాలంలో సరఫరా కాకపోవడం, రైతులు ముందస్తుగా నిల్వ చేసుకోవడం కారణమని డైరెక్టర్ వివరించారు. యాసంగిలో ఆ సమస్య రాకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
Also Read: Chandrababu Naidu: ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే.. ఏపీ ముఖ్యమంత్రి సంచలన వాఖ్యలు!

