Telangana Universities: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం బలోపేతానికి ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సర్కార్ బడులను ఇంటర్నేషనల్ స్కూల్ మాదిరిగా ఉండాలనే టార్గెట్‌తో ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే కోవలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయ సమగ్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా వెయ్యి కోట్లు కేటాయించి శభాష్ అనిపించుకున్నారు. ఓయూకు నిధులు కేటాయించడాన్ని అందరూ స్వాగతించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా మరి మిగతా విశ్వ విద్యాలయాల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓయూకు కేటాయించి ఇతర వర్సిటీలకు కేటాయించకపోవడంపై ఒకింత నిరాశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓయూ అభివృద్ధికి నిధులు కేటాయించినట్లే మిగతా వర్సిటీలకు కూడా ఇవ్వాలానే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ పై హైటెక్ కుట్రలు.. ఫేక్ వీడియోల హల్ చల్.. నెటిజన్స్ ఫైర్..
వీటి సంగతేంటి?
తెలంగాణలో పలు యూనివర్సిటీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, పాలమూరు, శాతవాహన విశ్వవిద్యాలయాలు గత కొంతకాలంగా తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. శిథిలావస్థకు చేరిన హాస్టల్ భవనాలు, మౌలిక వసతుల లేమి, అధ్యాపకుల ఖాళీలతో ఈ విద్యా సంస్థలు వెనుకబడిపోయాయి. ఈ నేపథ్యంలో ఓయూకు మాత్రమే భారీ ప్యాకేజీ ప్రకటించడంపై ఇతర వర్సిటీల విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓయూకు అందించినట్లుగా పెద్ద మొత్తంలో కాకపోయినా అందులో కొంతమేర సమకూర్చినా అభివృద్ధికి బాటలు పడుతాయని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలను సమానంగా చూడాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేవలం ఒకే వర్సిటీకి నిధులు కేటాయిస్తే మిగిలిన ప్రాంతాల్లోని విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వారు పేర్కొంటున్నారు.
అత్యవసరం ఇవే
ప్రత్యేకించి కాకతీయ యూనివర్సిటీ లాంటి పెద్ద వర్సిటీలకు కూడా ప్రత్యేక డెవలప్‌మెంట్ ప్యాకేజీలు ప్రకటించాలని కోరుతూ ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించే యోచనలో ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా చదువుకునే ప్రాంతీయ వర్సిటీల్లో ల్యాబ్‌లు, లైబ్రరీల ఆధునికీకరణకు నిధులు అత్యవసరం. ఉన్నత విద్యలో నాణ్యత పెరగాలంటే అన్ని వర్సిటీలకు పరిశోధనా నిధులు కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి విద్యాసంస్థను గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా తీర్చిదిద్దాలని డిమాండ్ వినిపిస్తోంది. ఒకేసారి వెయ్యి కోట్లు ఓయూకు కేటాయించడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకున్నప్పటికీ, ఇదే తరహాలో రాష్ట్రంలోని మిగిలిన యూనివర్సిటీల భవిష్యత్తుపై కూడా స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థి లోకం కోరుతోంది. రానున్న బడ్జెట్‌లో లేదా ప్రత్యేక నిధుల ద్వారా ఇతర వర్సిటీల కష్టాలను తీర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
Also Read: Telugu Politics: నడుస్తున్న చరిత్ర, వేడెక్కిన తెలుగు రాజకీయం.!

