Telangana Jagruti: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పై పథకం ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారని జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జాగృతి సీనియర్ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాటలనే కవిత మాట్లాడుతున్నారంటూ వి. ప్రకాశ్ అనే వ్యక్తి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రూప్ సింగ్ మాట్లాడుతూ వి. ప్రకాష్ చరిత్ర తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. హరీష్ రావు ఏర్పాటు చేసుకున్న ఫేక్ టీమ్ కు లీడర్ గా వి. ప్రకాష్ మాట్లాడుతున్నారని అన్నారు. స్వయం ప్రకటిత మేధావిగా చెప్పుకునే వి. ప్రకాష్ గతంలో కేసీఆర్, కేటీఆర్ గురించి కూడా తప్పుగా మాట్లాడారని గుర్తు చేశారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్, కేటీఆర్ అహంకారమే కారణమని వి. ప్రకాష్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారన్నారు.
కవితను బద్నాం చేసే ప్రయత్నం
హరీష్ రావు ను గొప్ప లీడర్ అన్నట్లుగా ప్రచారం చేసేందుకు ఇష్టమొచ్చినట్లు అబద్దాలు చెబుతున్నారన్నారు. నీళ్ల విషయంలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసిన కవితని ఇదే వి. ప్రకాష్ చాలా సార్లు పొగిడారన్నారు. కానీ ఆరు నెలల కాలంలో ఏమీ మారిందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రశించారు. వి. ప్రకాష్ తో పాటు చాలా మంది విశ్లేషకులు, యూట్యూబ్ ఛానెల్స్ పేరుతో కవితమ్మను అవినీతి పరురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బద్నాం చేసే ప్రయత్నం చేసే వారి నాలుక చీరేస్తామని హెచ్చరించారు. జాగృతి జనం బాటలో కవిత కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకనే కొంతమంది సోషల్ మీడియా టీమ్ లను పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రూప్ సింగ్ మండిపడ్డారు.
Also Read: Telangana Jagruti: యువతకు కవిత పిలుపు.. జూన్ 2న పోటీలు.. మ్యాటర్ ఏంటంటే!
ప్రకాష్ ఒక ప్యాకేజీ స్టార్
జాగృతి సీనియర్ నేత సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ వి. ప్రకాష్ ఒక ప్యాకేజీ స్టార్ అని విమర్శించారు. తనకు సుపారీ ఇచ్చిన నేత ఆనందం కోసం కవితమ్మ మీద కట్టుకథలు చెబుతున్నాడన్నారు. మేధావి, విశ్లేషకుడి ముసుగేసుకున్న వి. ప్రకాష్ చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలుసునని అన్నారు. ఒక గొప్ప సామాజిక విప్లవ నేత మరణానికి ఆయనే కారణమని చెప్పారు. సాయుధ, విప్లవ పోరాటాల నుంచి తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ వరకు కూడా అవకాశ వాద కుట్రలు చేసిన వ్యక్తి వి. ప్రకాష్ అని చెప్పారు. నువ్వొక పిట్టల దొర వి, ప్యాకేజీ స్టార్ వి, గొలుసు కట్టు వ్యాపారివి అంటూ వి. ప్రకాష్ పై మండిపడ్డారు.
ధైర్యం లేక తప్పుడు ప్రచారాలు
ఒక నాయకుడు కవిత గురించి తప్పుగా మాట్లాడాలని చెబితే నువ్వు మాట్లాడుతున్నావ్ అని అన్నారు. కవితమ్మను బద్నాం చేసేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తే తెలంగాణ సమాజం నమ్మదని అన్నారు. దమ్ముంటే ఆధారాలతో సహా మాట్లాడాలని ఆధారాలు ఉంటే చర్చకు తాను సిద్ధమని ఇస్మాయిల్ చెప్పారు. నిరాధరమైన ఆరోపణలు చేస్తే తరిమికొడతామని హెచ్చరించారు. మీ లాంటి మొరిగే కుక్కలను తెలంగాణ సమాజం పట్టించుకోదన్నారు. వి. ప్రకాష్ నీ మానసిక పరిస్థితి బాగాలేనట్లు ఉంది. వెంటనే హాస్పిటల్ లో చూపించుకో అని ఆయనకు సూచించారు. ప్రజల ముందు మీరు చేసిన తప్పులను బయటపెడితే వాటికి సమాధానం చెప్పే ధైర్యం లేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధమైన ఆరోపణలు, నిందలు వేస్తే బొంద పెడతామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో కవితక్క పై తప్పుడు ప్రచారాలు చేస్తున్న గుంటనక్కల సముహానికి సరైన జవాబు చెబుతామన్నారు.
Also Read: MLC Kavitha: రాష్ట్రంలో కామన్ స్కూల్ సిస్టమ్ పెట్టాలని కవిత డిమాండ్..!

