నగరి, స్వేచ్ఛ: మూడేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నగరి (Nagari) మండలంలో చిన్నారిపై అత్యాచారం జరిగితే పోలీసులు సీరియస్‌గా తీసుకోకపోవడం హాట్ టాపిక్ అయింది. చివరకు హోంమంత్రి ఎంట్రీ తర్వాత కేసు స్పీడ్ అందుకుందన్న చర్చ జరుగుతోంది. ఈ దారుణ ఘటన చుట్టూ రాజకీయ మంటలు అలుముకోవడం చర్చనీయాంశమైంది. మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని నగరి అర్బన్ పీఎస్‌లో బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు. కానీ, పోలీసులు నిర్లక్ష్యం చేశారు. దానికి కారణం నిందితుడు మోహన్ వైసీపీ కార్యకర్త అని బాధితురాలి తండ్రి చెబుతున్నాడు.
ఫోటోలు తీసిన నిందితుడు
బాధితురాలి తండ్రి కథనం ప్రకారం.. తనకి నిందితుడు మోహన్‌తో పరిచయం ఉంది. తాజాగా విడుదల అయిన సినిమా అప్‌లోడ్ చేయమని మోహన్ సెల్‌ఫోన్ ఇచ్చాడు. గ్యాలరీలోకి వెళ్లి చూడగా, తన కూమార్తెతో అసభ్యంగా ఉన్న ఫోటోలు కనిపించాయి. దీనిపై కుమార్తెను అతని భార్య ప్రశ్నించగా, అనేక చోట్ల తాకాడని చెప్పింది. వెంటనే, తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశానని బాలిక తండ్రి చెప్పాడు. కానీ, తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలు తనపై దాడి చేయడానికి వచ్చారని తెలిపాడు. పోలీసులు నిందితుడికి, అతని తరపు వారికి సహకరించారని వాపోయాడు. పైగా, ఆలయం విషయంలో తాను అడ్డొస్తున్నానని లేనిపోనివి చెప్పి ఇష్యూని డైవర్ట్ చేసే కుట్ర చేశారని తెలిపాడు. టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్‌కు ఎన్నికలలో తాను సహకరించానని దానిని మనుసులో పెట్టుకొని ఇలా చేశారని వాపోయాడు. సీఐ మహేష్‌తో పాటు పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని, నిందితుడికి స్టేషన్‌లో రాచమర్యాదలు చేశారని చెప్పాడు.
బాధిత కుటుంబానికి అండగా టీడీపీ నేతలు
ఫిర్యాదు అందిన తర్వాత చిన్నారిని నగరి (Nagari) ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలకు తరలించారు. అక్కడ నిందితుడి తరుఫు వారు పెద్ద సంఖ్యలో చేరుకొని కేసు వాపసు తీసుకోమని బాధిత కుటుంబంపై ఒత్తిడి తెచ్చినట్టు స్థానిక టీడీపీ నేత మీరా తెలిపారు. చాలామంది వచ్చి ఆస్పత్రి దగ్గర గొడవ చేస్తుంటే, కనీసం పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని, దీంతో ఎమ్మెల్యేతోపాటు హోంమంత్రి అనిత దృష్టికి తీసుకుపోయినట్లు చిత్తూరు జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు అరుణ అన్నారు. తర్వాత చిన్నారిని తిరుపతిలోని ప్రసూతి వైద్యశాలకు తరలించారని, అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారని చెప్పారు. చిన్నారిని ఆస్పత్రిలో చిత్తూరు ఎంపీ ప్రసాద్‌తో పాటు మహిళా అధ్యక్షురాలు పరామర్శించారు. అదే సమయానికి నగరి డీఎస్పీ అజీజ్ వచ్చారు. విషయాన్ని రాజకీయం చేయొద్దని చెప్పారు. కేసు పెట్టాక బాధిత కుటుంబంపై దాడికి పాల్పడ్డారని, పోలీసుల నిర్లక్ష్యంపై వదిలేది లేదని నేతలు స్పష్టం చేశారు.
రోజా మౌనం ఎందుకు?
రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న మాజీ మంత్రి రోజా, తన నివాసానికి దగ్గరలో జరిగిన ఘటనపై ఎందుకు నోరు మెదపడం లేదని టీడీపీ ప్రశ్నిస్తోంది. నిందితుడు వైసీపీ కార్యకర్త కావడం వల్లే ఆమె సైలెంట్‌గా ఉన్నారని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అరుణ అన్నారు. అయితే, పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. కావాలని తమను టార్గెట్ చేసి, రాజకీయం చేస్తున్నారని అంటున్నారు.