TG Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కి అభినందనలు తెలియజేస్తూ ఓ ప్రత్యేక లేఖ రాశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు రావడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలన, స్థిరత్వం, భవిష్యత్తు పైన ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, లైప్ సైన్సెస్ వంటి రంగాల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 శక్తికి నిదర్శనమన్నారు.
ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాల పెంపు
ప్రపంచవేదిక పైన తెలంగాణ పోటీ పడటానికి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణలో ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాల పెంపు కోసం చేస్తున్న ప్రయత్నాలు హర్షనీయమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పెట్టుబడులు తెలంగాణలోని ప్రతి పౌరుడి కి ప్రపంచ స్థాయి వైద్యం అందేలా చేస్తాయన్నారు. ప్రజారోగ్యంలో మౌలిక సదుపాయలు కల్పించడానికి పెట్టుబడులు ఉపయోగపడతాయన్నారు.
2026 మూడో వారంలో రాష్ట్ర పర్యటన
క్యాన్సర్ చికిత్సలో తెలంగాణ గ్లోబల్ లీడర్ గా నిలబడే అవకాశాలున్నట్లు తెలిపారు. ప్రపంచ దిగ్గజాలను హైదరాబాద్, ఫోర్త్ సిటీకి రప్పించి తెలంగాణను భారత దేశ స్టార్టప్ గా, మానవ కేంద్రీకృత అభివృద్దికి ప్రపంచ కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుజువు చేశారని కొనియాడారు. జనవరి 2026 మూడో వారంలో రాష్ట్ర పర్యటన సమయంలో ముఖ్యమంత్రిని కలుసుకోవాలని డా. నోరి ఆకాంక్ష వ్యక్తం చేశారు.

