TG Global Summit: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు, విద్యార్థినీ, విద్యార్థులు సందర్శించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఈ స్టాళ్లను సందర్శించడానికి జనాలు బారులు తీరారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమాలు ‘డిస్కవర్ తెలంగాణ కల్చరల్ హెరిటేజ్ అండ్ నెక్స్ట్–జెన్ టూరిజం’ అనే అద్భుతమైన సదస్సుతో ప్రారంభమైంది. వివిధ కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ చరిత్ర, మ్యూజియం సంస్కృతి, పర్యాటక అభివృద్ధి, ఆహార సంస్కృతి తదితర విభిన్న కోణాల్లో విలువైన విశ్లేషణలను ఈ సదస్సులో పాల్గొన్న వక్తలు వివరించారు. తెలంగాణను ప్రపంచ స్థాయిలో ఒక సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలను వీరు వివరించారు.
ఆసక్తిగా అడిగి
27కు పైగా స్టాళ్లలో సందర్శకుల ఆసక్తి అనంతరం, ‘తెలంగాణ రైజింగ్- ఎంపవరింగ్ ఆల్, గ్రోవింగ్ టుగెదర్’ అనే సదస్సులో ప్రముఖులు విద్యార్థులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా చేపట్టిన ప్రగతిని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై క్లుప్తంగా వివరించారు. ఈ సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏరోస్పెస్, మూసీ రివర్ డెవలప్మెంట్, హ్యాండీ క్రాఫ్ట్స్, టూరిజం, ఎడ్యుకేషన్, కరీంనగర్ ఇక్కత్, ఫిలిగ్రి, చేర్యాల పెయింటింగ్స్, సైబర్ క్రైమ్ ఛేదనలో ఉపయోగించే పలు ఆధునాతన పరికరాలు, డ్రోన్స్, రోబో తదితర 27కు పైగా స్టాళ్లను సందర్శకులు అత్యంత ఆసక్తిగా తిలకించారు. ప్రధానంగా, ఆధునిక పరికరాలు, వైమానిక అంశాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కాగా, రేపు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటలవరకు ఈ గ్లోబల్ సదస్సును సందర్శించవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read: TG Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో తొలిరోజు వచ్చిన పెట్టుబడులు ఇవే..!

