AV Ranganath: ప్రకృతి పరిరక్షణలో ప్రైవేట్ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) అవసరమని హైడ్రా (Hydra) కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. నగరంలో చెరువులను పెద్ద మొత్తంలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికీ 6 చెరువుల అభివృద్ధి చేపట్టగా, త్వరలో మరో 14 చెరువులను పునరుద్ధరించనున్నట్టు తెలిపారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సదస్సులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) మాట్లాడుతూ చెరువుల అభివృద్ధితో నగరంలో వరదలను కట్టడి చేయవచ్చునని చెప్పారు.
ఆక్రమణలు తొలగించి వెడల్పు
బతుకమ్మకుంట ఒక ఉదాహరణగా ఆయన చెప్పారు. ప్రతి ఏటా ఆ పరిసరాలు నీట మునిగేవని, ఈ ఏడాది ఆ సమస్య తలెత్తలేదన్నారు. వర్షం నీరు నేరుగా బతుకమ్మకుంటకు చేరడంతో వరద ముప్పు ఆ ప్రాంతాలకు తప్పిందన్నారు. నగరంలో చెరువులు, వాటిని అనుసంధానం చేసే కాలువలను పరిరక్షించుకుంటే వరద ముప్పులేని నగరం సాధ్యమన్నారు. సికింద్రాబాద్ ప్యాట్నీ నాలా 20 మీటర్ల వెడల్పుతో ఉండగా, ప్యాట్నీ వద్దకు వచ్చేసరికి 5 మీటర్లకు కుంచించుకు పోతే 27 కాలనీలు ప్రతి ఏటా వరద ముప్పు ఎదుర్కొనేవని, ఈ ఏడాది ఆక్రమణలు తొలగించి వెడల్పు పెంచడం వల్ల ఆ ప్రాంతాలన్నీ సేఫ్‌గా ఉన్నాయని కమిషనర్ చెప్పారు.
Also Read: AV Ranganath: ఉత్తమ విధులు నిర్వర్తించిన మెట్ టీమ్‌లను.. అభినందించిన హైడ్రా కమిషనర్ రంగనాధ్!
మెరుగైన సమాజం కోసం యువత పిలుపు
బాధ్యతాయుతమైన పౌరులతోనే మెరుగైన సమాజం ఏర్పడుతుందని, ఎవరికి వారు మనకెందుకు అనుకోకుండా తనవంతుగా సమాజ హితం కోసం కాస్త ఆలోచించాలని రంగనాథ్ సూచించారు. ముఖ్యంగా యువత ఈ విషయమై దృష్టి పెట్టాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తనను తాను రక్షించుకోవడమే కాకుండా, తోటి వారితో పాటు చుట్టుపక్కల వారిని సురక్షితంగా కాపాడేందుకు ఉద్దేశించిన ‘యువ ఆపద మిత్ర’ పథకం కింద నియమితులైన వలంటీర్లకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్లాటినమ్ జూబ్లీహాల్‌లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో రంగనాథ్ ప్రసంగించారు. ఎన్‌డీఎంఏ ప్రారంభించిన ఈ పథకంలో వివిధ కళాశాలల విద్యార్థులు భాగస్వాములు కావటం శుభపరిణామమన్నారు. కమ్యూనిటీ ఆధారిత మొదటి ప్రతిస్పందనదారుల నెట్‌వర్క్‌ను రూపొందించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. శిక్షణ పొందిన వారు ఎంత వేగంగా స్పందిస్తే ప్రమాద తీవ్రతను అంతమేరకు తగ్గించవచ్చునని హైడ్రా కమిషనర్ అభిప్రాయపడ్డారు.
Also Read: AV Ranganath: వరద ముప్పులేని నగరమే అందరి లక్ష్యం : హైడ్రా కమిషనర్ రంగనాధ్

