Karimnagar BJP: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. గత పంచాయతీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలోని మొత్తం 800కు పైచిలుకు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తే, కేవలం 22 స్థానాల్లో మాత్రమే బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. కానీ, ఈసారి మాత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్ కమార్ ఆధ్వర్యంలో తొలి దశ ఎన్నికల్లోనే గురువారం రాత్రి వరకు 42కిపైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయకేతనం ఎగరేయడం విశేషం. రాత్రి 10.30 గంటల సమయానికి ఇంకా పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. మొత్తం 50 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నట్లు కౌంటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తొలిదశ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు 160 స్థానాల్లో మాత్రమే పోటీ చేశారు. అందులో 50కి పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందే దిశగా దూసుకెళ్లడం, మరో 10 మంది స్వతంత్ర అభ్యర్థులు బీజేపీలోకి వచ్చేందుకు మంతనాలు జరుపుతుండటం గమనార్హం.
గెలుపునకు కారణమేంటి?
కేంద్ర నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా గ్రామాల అభివ్రుద్ధికి నయాపైసా కూడా ఇయ్యకపోవడమే ఇందుకు కారణమని ఇండిపెండెంట్ అభ్యర్థులు చెబుతున్నారు. పైగా బండి సంజయ్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నందున ఎంపీ లాడ్స్, సీఎస్సార్ ఫండ్స్‌తోపాటు కేంద్రంతో మాట్లాడిన అత్యధిక నిధులను గ్రామ పంచాయతీల అభివృద్ధికి తీసుకొచ్చే అవకాశముందని వారు భావిస్తున్నారు. సంజయ్ సైతం, గ్రామాల అభివృద్ధిపై తాను ప్రత్యేక చొరవ తీసుకుని వివిధ రూపాల్లో నిధులు తీసుకొస్తానని పలుమార్లు చెప్పడంతో బీజేపీలో చేరితేనే తమ గ్రామాలకు ప్రయోజనం ఉంటుందని భావిస్తున్న పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ మేరకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
Also Read: BJP Telangana: బీజేపీ జిల్లా అధ్యక్షులతో నిత్యం ఫిర్యాదులు.. సంచలన నిర్ణయం తీసుకున్న కమలం ..!
బండి ప్రచారం చేయకున్నా
పార్టీ గుర్తుల్లేకుండా ఎన్నికలు జరుగుతుండటంతో బండి సంజయ్ ఎక్కడా ప్రచారం కూడా చేయలేదు. కానీ, బీజేపీ పక్షాన పోటీ చేస్తున్న అభ్యర్థులందరితో నిరంతరం టచ్‌లో ఉన్నారు. వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని వారికి వివరిస్తూ అప్రమత్తం చేస్తూ వచ్చారు. టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పోల్ మేనేజ్మెంట్‌పై పలు సూచనలు చేశారు. చివరి నిమిషం వరకు అభ్యర్థుల పరిస్థితిపై ఆరా తీస్తూనే గెలుపు తీరానికి చేర్చడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవడం గమనార్హం. వాస్తవానికి తొలిదశ ఎన్నికల్లో 30 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తామని బీజేపీ నేతలు అంచనా వేశారు. 2, 3 దశ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ధీటుగా స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని భావించారు. కానీ, తొలిదశలోనే అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు రావడంతో బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
మీ ఆశీర్వాదానికి థ్యాంక్స్
పంచాయతీ ఎన్నికల ఫేజ్-1 ఫలితాల్లో బీజేపీకి గ్రామీణ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో పార్టీ క్రమేణా బలోపేతమవుతోందనేందుకు ఈ గెలుపు నిదర్శనంగా చెప్పుకొచ్చారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు, కొత్త రోడ్లు, వీధి దీపాలు, శ్మశానవాటికలు, రైతు వేదికలు, పేదల కోసం ఉచిత బియ్యం, పక్కా ఇండ్లు, మరుగుదొడ్లు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, మహిళా సంఘాలకు రుణాలు, యువతకు స్వయం ఉపాధి పథకాలు, ఉపాధి హామీ నిధులు, తాగునీరు, ఆరోగ్య భద్రత, పీఎం కిసాన్ వంటి పథకాలు గ్రామీణ జీవనాన్ని గణనీయంగా మార్చుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అభివృద్ధిపై ఉన్న ప్రజల నమ్మకమే బీజేపీకి వచ్చిన ఈ విజయానికి కారణమని చెప్పారు. ఇంకా మిగిలిన స్థానిక సంస్థల ఫేజ్-2, ఫేజ్-3 ఎన్నికల్లో మరింత బలంగా పోటీ ఇస్తామని ధీమా వ్యక్తంచేశారు. కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లాలని, గ్రామాల్లో కేంద్రం చేస్తున్న అభివృద్ధిని వివరించాలని రాంచందర్ కోరారు.
Also Read: Karimnagar District: ఓరి నాయనా.. స్మశానంలో దీపావళి వేడుకలు.. ఎక్కడో తెలుసా..!

