Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు.. పోలీసులకు సరెండర్ కావాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది. రేపు పోలీసులకు లొంగిపోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో దర్యాప్తు అధికారులకు సైతం ధర్మాసనం కొన్ని సూచనలు చేసింది. ఆయన్ను శారీరకంగా టార్చర్ చేయడానికి వీల్లేదని, విచారణలో భాగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
‘జూబ్లీహిల్స్ స్టేషన్ లో లొంగిపోండి’
ఫోన్ టాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రభుత్వ తరపు లాయర్ వాదనలతో ఏకీభవించింది. ప్రభాకర్ రావు రేపు సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. రేపు జూబ్లిహిల్స్ పోలీస్టేషన్ లో లొంగిపోవాలని సూచించింది. కస్టోడియల్ విచారణలో భాగంగా సిటీ ఏసిపి వెంకటగిరి ముందు రేపు ఉదయం 11 గంటలకు లొంగిపోవాలని కోర్టు చెప్పింది. అయితే విచారణలో భాగంగా పిజికల్ టార్చర్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి (డిసెంబర్ 19) వాయిదా వేసింది.
ప్రభుత్వ వాదనలు ఏంటంటే?
ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. కోర్టును ఆశ్రయించింది. 14 రోజుల కస్టడీకి అప్పగించాలని ధర్మాసనాన్ని కోరింది. దీనిపై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్ ల ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున సిద్దార్థ లుత్ర వాదనలు వినిపించారు. మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ విచారణకు సహకరించడం లేదని ధర్మాసనానికి తెలిపారు. ప్రభాకర్ రావుకు ఉన్న ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరారు. ఫోన్ టాపింగ్ కేసులో వాస్తవాలు తెలియాలంటే, ప్రభాకర్ రావును అరెస్ట్ చెయాల్సిందేనని ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశారు.
Also Read: Hyderabad Crime: పవిత్ర హత్య కేసులో ట్విస్ట్.. మద్యం మత్తులో ఘాతుకం.. కేసును ఛేదించిన పోలీసులు!
‘పవర్ లోకి రాకముందే బెదిరించారు’
మరోవైపు ప్రభాకర్ రావు తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు ఒక సీనియర్ సిటిజన్ అని గుర్తు చేశారు. ఆయన్ను ప్రభుత్వం టార్గెట్ చేసిందని.. ‘కాంగ్రెస్ వస్తుంది, నీ సంగతి చెప్తాం’ అధికారంలోకి రాకముందే బెదిరించారని కోర్టుకు తెలియజేశారు. కాబట్టి పోలీసు కస్టడీలోకి కాకుండా హౌస్ అరెస్ట్ చేసి ప్రభాకర్ రావును విచారణ జరిపించాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే అతడి వాదనలతో ఏకీభవించని సుప్రీంకోర్టు ధర్మాసనం.. రేపే సరెండర్ కావాలని ఆదేశించింది.

