CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రితో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో పాటు సినీ రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు జెనీలియా, అక్కినేని అమల సహా టాలీవుడ్, బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి, విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సినీ ప్రముఖులతో చర్చించారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అందించబోయే చేయూతను వివరించారు.
Also Read- Om Shanti Shanti Shantihi Teaser: తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బాల మూవీ టీజర్ ఎలా ఉందంటే.. పక్కా హిట్!
ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రధాన హామీలు, సూచనలు
సమగ్ర సహకారం: రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ: హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని సీఎం వివరించారు.
స్థానికులకు శిక్షణ: సినీ పరిశ్రమలోని ‘24 క్రాఫ్ట్స్’ అవసరాలకు అనుగుణంగా స్థానికులకు శిక్షణ (ట్రైనింగ్) ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సినీ ప్రముఖులకు ముఖ్యమంత్రి సూచించారు.
స్టూడియోల ఏర్పాటుకు ప్రోత్సాహం: ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని సీఎం హామీ ఇచ్చారు.
సినిమా నిర్మాణంలో పూర్తి మద్దతు: కేవలం స్క్రిప్ట్‌తో తెలంగాణకు వస్తే, సినిమా పూర్తి చేసుకుని వెళ్ళేలా సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Also Read- Akhanda 2: బాలయ్య డేట్స్ ఇచ్చినందుకు ఆయన బిడ్డకు రూ. 10 కోట్లా! ఇలా కూడా ఉంటుందా!
పూర్తిగా సహకరిస్తాం
తెలంగాణను సినీ నిర్మాణాలకు అనుకూలమైన కేంద్రంగా మార్చడానికి, ఇక్కడ పెట్టుబడులను ఆకర్షించడానికి, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో సీఎం తెలిపినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సినిమా హబ్‌గా మార్చడంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని వారు తెలిపినట్లుగా సమాచారం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ‘ఫిల్మ్ ఇన్ తెలంగాణ’లో మంగళవారం ‘ఒక దేశం, అనేక సినిమాలు’ పేరుతో ఇండస్ట్రీ ప్యానెల్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అర్జున్ కపూర్, జెనీలియా దేశ్‌ముఖ్, రితీశ్ దేశ్‌ముఖ్, అనిరుద్ధ రాయ్ చౌధూరీ, రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా, జోయా అక్తార్, పార్థివ్ గోహిల్, అసిఫ్ అలీ హాజరుకానున్నారు. ఈ సమ్మిట్‌కు వచ్చే ముందు వీరంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

