– కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు
– అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం
– మంత్రి పదవికీ లాబీయింగ్
– హస్తినలోనే సీఎం రేవంత్
– కోట నీలిమ అంగీకరిస్తారా?
– టీపీసీసీకి లేని సమాచారం
Ex Minister Talasani Srinivas Yadav: మాజీమంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మంగళవారం ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్న వేళ.. ఆయన ఢిల్లీ పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ పార్టీలోని పరిణామాలు, కుమారుడి రాజకీయ భవితవ్యం దృష్ట్యా శ్రీనివాసయాదవ్ కాంగ్రెస్ చేరాలని నిర్ణయించుకునున్నారని, ఈ క్రమంలో అధిష్ఠానం పెద్దలతో చర్చల కోసమే ఆయన ఢిల్లీలో మకాం వేసినట్లు తెలుస్తోంది.
మార్పు ఎందుకంటే..
2014లో టీడీపీ తరఫున గెలుపొందిన తలసాని.. తర్వాతి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరి, రెండుసార్లు మంత్రిగా పని చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం తర్వాత ఆయన రాజకీయంగా పెద్దగా చురుగ్గా లేరు. మరోవైపు తన రాజకీయ వారసుడిగా కుమారుడు సాయి కిరణ్‌ను ముందుకు తీసుకువచ్చారు. గతంలో లోక్‌సభ బరిలో నిలిచినా విజయం సాధించలేకపోయారు. ఇటు.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం, ఆ పార్టీలోని అంతర్గత పరిణామాలు, కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్, కమిషన్ల విచారణ వంటి అంశాలతో అక్కడ తనకు ఎలాంటి భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరితే.. సనత్ నగర్ నియోజక వర్గంలో తన పట్టు నిలుపుకోవటంతో బాటు కుమారుడికి తగిన రాజకీయ భవితవ్యం ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
అఖిలేష్‌తో రాయబారం..
అయితే, తలసాని చేరికపై టీపీసీసీ నేతలు అంత సుముఖంగా ఉన్నట్లు కనపించటం లేదు. బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉండగా ఆయన నాటి పీసీసీ అధ్యక్షుడు, నేటి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన తీరు, కాంగ్రెస్ పార్టీపై వ్యవహరించిన పద్ధతుల పట్ల నేటికీ టీపీసీసీలో చాలామందికి అభ్యంతరాలున్నాయి. పైగా, సనత్ నగర్ నియోజకవర్గంలో పోటీ చేసి తలసాని చేతిలో ఓటమి పాలైన కోట నీలిమ దీనిని స్వాగతించరనే అనుమానమూ ఉంది. ఈమె భర్త పవన్ ఖేరా కాంగ్రెస్ జాతీయ మీడియా కమిటీకి అధ్యక్షుడిగానే గాక గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగానూ గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో తన మిత్రుడైన యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ద్వారా తలసాని.. రాహుల్ గాంధీకి రాయబారం పంపినట్లు తెలుస్తోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన అఖిలేష్, తలసాని మధ్య గతం నుంచే సన్నిహిత సంబంధాలున్నాయి. యూపీ సీఎంగా అఖిలేష్ ఉన్నకాలంలో తన హైదరాబాద్ పర్యటన సందర్భంగా తలసాని ఇంటిలో ఆతిథ్యం కూడా పొందిన సంగతి తెలిసిందే.
రేవంత్ సమక్షంలోనే..
మంత్రివర్గ విస్తరణ అంశంపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు నేడు ఢిల్లీ వచ్చారు. తలసాని చేరికపై ఇప్పటికే హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సమక్షంలో కుమారుడితో కలిసి ఆయన పార్టీలో చేరబోతున్నారని తలసాని అనుచరులు చెబుతున్నారు. పార్టీలో చేరటంతో బాటు అఖిలేష్ రాయబారం ఫలిస్తే.. తమ నాయకుడికి మరోసారి మంత్రి పదవీ దక్కే అవకాశముందని వారు భావిస్తున్నారు. ఇదే జరిగితే.. బీఆర్ఎస్ వీడిన ఎమ్మెల్యేల
ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వారి దారిలోనే తలసాని పయనించనున్నట్లు తెలుస్తోంది.