– ప్రతివారం ఫీల్ట్ విజిట్, ప్రతినెలా సమీక్ష మస్ట్
– కొత్తగా ఆలోచిస్తేనే మంచి ఫలితాలు
– బాగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తా
– పాలన ప్రజలకు అనుభవంలోకి రావాలి
– కార్యదర్శుల సమీక్షలో సీఎం రేవంత్
Officers: పాలనలో వేగం పెంచటంతో బాటు రానున్న బడ్జెట్ సమావేశాలకు అన్ని శాఖలనూ సన్నద్ధం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంగళవారం సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల హడావుడి కారణంగా నెమ్మదించిన పాలనను పరుగులు పెట్టించే దిశగా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ఆయా శాఖలకు ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు.
పనితీరు పెరగాలి..
కార్యదర్శులు తమ శాఖకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో నెలనెలా సమీక్ష జరపాలని ముఖ్యమంత్రి సూచించారు. శాఖల పనితీరు మెరుగుపడాలంటే మూస ధోరణులను పక్కనబెట్టి, మారుతున్న పరిస్థితులను బట్టి మరింత వినూన్నంగా ఆలోచించాలన్నారు. ప్రతిశాఖ నెలాఖరు నాటికి అంతర్గత సమీక్ష జరపాలని, గడచిన నెల సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఏమేరకు అమలు చేశామనేది మదింపు చేయాలని కార్యదర్శులకు సూచించారు. అదేవిధంగా.. ఆయా శాఖల పనితీరుగా ప్రతినెలా తాను సమీక్షిస్తానని ప్రకటించారు. ‘వచ్చామా.. వెళ్లామా’ అన్నట్టు పని చేస్తే కుదరదని, ఉన్నతాధికారులంతా బాధ్యతాయుతంగా పనిచేయాలని హెచ్చరించారు. బాగా పని చేసే అధికారులకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఫీల్డ్ విజిట్స్ మస్ట్..
కార్యదర్శులు సచివాలయానికే పరిమితమైతే కుదరదని, తమ తమ పరిధిలో అందరూ వారానికోరోజు క్షేత్ర స్థాయి పర్యటనలు జరిపి వాస్తవిక పరిస్థితులను తెలుసుకోవాలని సీఎం ఆదేశించారు. మొక్కుబడిగా ఫీల్డ్ విజిట్స్ చేస్తే సరిపోదని, ప్రజలతో మాట్లాడి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలని సూచించారు. ఇకపై, తాను కూడా ఫీల్డ్ విజిట్, ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు.
బడ్జెట్‌పై కసరత్తు
రాబోయే వార్షిక బడ్జెట్‌కు సంబంధించి అన్ని శాఖలూ తమ అంచనాలను వాస్తవికత ఆధారంగా అందజేయాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వం మాదిరిగా మితిమీరిన అత్యుత్సాహంతో బడ్జెట్ పెట్టటానికి బదులు వాస్తవాల ప్రాతిపదిక పద్దును తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. జులై 22 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్నందన మర్నాటి నుంచి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టేలా.. ఏర్పాట్లు చేయనున్నారు.
వరుస భేటీలు
తెలంగాణ ముఖ్యమంత్రి మంగళవారం నోకియా జర్మనీ ప్రతినిధి బృందంతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో నోకియా గ్లోబల్ హెడ్ మార్టీన్, సేల్స్ హెడ్ మ్యాన్క్, గ్లోబల్ డైరెక్టర్ వెంకట్, రాజేష్, సీస్ రావ్, పద్మజ, ఎమ్మెల్యే మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఇండియన్ పారాసైక్లింగ్ టీమ్ ప్రతినిధులు కూడా సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.