Jr NTR: రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన పేరు, ఫొటోలు, గెటప్స్, వాయిస్‌ను వాణిజ్యపరంగా అనుమతి లేకుండా వాడితే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కోర్టు నుంచి వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) అనుమతి పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నడుస్తున్నారు. తన పేరును, ఫొటోలను, వీడియోలను దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేలా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తులు, సంస్థలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వీడియోలను వాడుకుంటూ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో దీని దుర్వినియోగం ఎక్కువ కావడంతో, వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఎన్టీఆర్ కోర్టును కోరారు.
Also Read- Bigg Boss Telugu 9: సంజన జైలుకి, తాత్కాలిక కెప్టెన్‌గా భరణి.. నామినేషన్స్ టాస్క్‌లో విన్నర్ ఎవరు?
ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం, సోమవారం ఎన్టీఆర్‌కు అనుకూలంగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించి, ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు (ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్), ఈ-కామర్స్ సంస్థలను ఆదేశించింది. 2021 ఐటీ నిబంధనల ప్రకారం మూడు రోజుల్లోగా ఈ చర్యలు చేపట్టాలని, ఉల్లంఘనకు పాల్పడుతున్న కంటెంట్‌ను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court Order) స్పష్టం చేసింది. ఈ తీర్పు సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు సంబంధించిన కేసుల్లో ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ సందర్భంగా జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా, తదుపరి విచారణను డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేస్తున్నామని, ఆ రోజున ఈ అంశంపై మరింత లోతైన, వివరమైన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేశారు. చిరంజీవి, ఎన్టీఆర్ వంటి వారు తీసుకున్న ఈ చర్య ఇతర సినీ ప్రముఖులకు కూడా మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read- Bandi Saroj Kumar: కొంచమైనా బాధ్యత ఉండాలిగా.. ‘అఖండ 2’ నిర్మాతలపై ‘మోగ్లీ’ విలన్ ఫైర్!
ఫ్యాన్ వార్స్‌కు బ్రేక్స్ పడతాయా..
చిరంజీవి, ఎన్టీఆర్ మాత్రమే కాదు.. వారి కంటే ముందు టాలీవుడ్ నుంచి నాగార్జున (King Nagarjuna) కూడా ఇదే విషయంపై కోర్టును ఆశ్రయించారు. ఇక బాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో ఐశ్వర్యరాయ్ కూడా ఢిల్లీ కోర్టును ఆశ్రయించి వార్తలలో నిలిచిన విషయం తెలిసిందే. అమితాబ్, అభిషేక్, అజయ్ దేవగణ్ వంటి వారందెరో.. వారి వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా కొందరు వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు.. చిరంజీవి, ఎన్టీఆర్ వంటి వారు ఇలా కోర్టుకు వెళ్లడంతో.. ఈ సమస్య చిన్నది కాదనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. ఇది వారి వ్యక్తిగతంగా మంచి అడుగుగానే భావించాలి. ఎందుకంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో ఎలాంటి ఫ్యాన్ వార్స్ నడుస్తున్నాయో తెలియంది కాదు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలను కాకుండా వారి ఇంటిలోని వారిపై కూడా ఇష్టం వచ్చినట్లుగా స్పేస్‌లు పెట్టి మాట్లాడుతున్నారు. అలాంటి వారందరికీ బ్రేక్ వేసేలా కోర్టులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సెలబ్రిటీలెందరో తమ వాదనను వినిపిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

