Seethakka: మహిళ ఎదిగితే కుటుంబం ఎదుగుతుంది. సమాజం ఎదుగుతుంది. రాష్ట్రం ఎదుగుతుంది. అందుకే మా ప్రభుత్వం మహిళ శక్తిని కేంద్రబిందువుగా చేసుకుని పని చేస్తోందని మంత్రి సీతక్క(Seethakka) అన్నారు. ఇందిరా మహిళా శక్తి స్టాల్‌లో కనిపిస్తున్న ప్రతీ విజయగాథ మా తెలంగాణ మహిళల ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం అని పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో మహిళా సాధికారతను ప్రతిబింబించే ఇందిరా మహిళా శక్తి స్టాల్‌ను ప్రారంభించారు. మహిళల నిర్వహణలో ఉన్న పెట్రోలు బంకులు, హైటెక్ సిటీలో పనిచేస్తున్న మహిళా శక్తి బజార్, జిల్లాల వ్యాప్తంగా నిర్మితమైన మహిళా శక్తి భవనాలు, శక్తి క్యాంటిన్లు, అలాగే ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణలో మహిళలు సాధిస్తున్న విజయాలు దేశ విదేశాల ప్రతినిధులను ఆకట్టుకున్నాయి.
మహిళల చేతుల్లో పెట్టిన ఒక్క అవకాశం
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, గ్రామీణ మహిళా సంఘాలు పెద్ద స్థాయిలో వ్యాపారాలు నడపడం… కార్పొరేట్ స్థాయి సేవలు అందించడం… ఇదే కొత్త తెలంగాణ శక్తి. మహిళకు వేదిక ఇస్తే ఆమె అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తుందనే దానికి ఈ మోడల్స్ సాక్ష్యంఅన్నారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ వేదికల వరకు మహిళల ప్రయాణాన్ని ప్రతిబింబించే డాక్యుమెంటరీలను కూడా స్టాల్‌లో ప్రదర్శించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నిజంగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయి అనే సాక్ష్యాలు ఇవి మహిళల చేతుల్లో పెట్టిన ఒక్క అవకాశం సమాజానికి పది రెట్లు తిరిగి వస్తుంది.. ఈ డాక్యుమెంటరీలు మా మహిళల అసలైన శక్తిని చూపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ స్టాల్, తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత పట్ల పాటిస్తున్న నిబద్ధతను ప్రతిబింబిస్తూ దేశ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందన్నారు.
గ్లోబల్ మోడల్‌గా తెలంగాణ
హిళలు ఎదిగితే దేశం ఎదుగుతుందని, మహిళలు సంపత్తిని సృష్టించగలిగితే అభివృద్ధి నిజమైన అర్ధాన్ని సంతరించుకుంటుందని సీతక్క అన్నారు. మహిళలు వ్యాపారాలు నడపడం ఆర్థిక వ్యవస్థకు అత్యంత స్థిరత్వాన్ని ఇస్తుందని, ఈ మార్పుకు తెలంగాణే నాయకత్వం వహిస్తుందన్నారు. తెలంగాణ మహిళల ప్రతిభ, ఆవిష్కరణలు, సామాజిక–ఆర్థిక పురోగతిని ప్రపంచ వేదికపై ప్రతిధ్వనింపజేయడం ఈ గ్లోబల్ సమ్మిట్ లక్ష్యమని వెల్లడించారు.గత రెండేళ్లలో చేపట్టిన కార్యక్రమాలు కేవలం సంక్షేమం వరకే పరిమితం కాలేదని, అవి మహిళల నిజమైన సాధికారత వైపు తీసుకెళ్లే సంస్కరణలని చెప్పారు. వడ్డీలేని రుణాలు, స్ట్రీ నిధి ద్వారా భారీ స్థాయిలో అందించిన క్రెడిట్ సపోర్ట్, లక్షలాది సూక్ష్మ మధ్యతరగతి వ్యాపారాల ఏర్పాటుతో మహిళల ఆర్ధిక స్వరూపం అమూల్యంగా మారిందని తెలిపారు.
సెర్ప్, మెప్మా విలీనం చారిత్రాత్మక నిర్ణయం
ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి భవనాలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచిన కేంద్రాలుగా మారాయన్నారు. ప్రమాద బీమా, లోన్ బీమా వంటి రక్షణ వలయాలు సమాన అవకాశాలను బలపరుస్తున్నాయని వివరించారు. గ్రామీణ, పట్టణ మహిళా అభివృద్ధిని ఒకే శ్రేణిలోకి తీసుకొచ్చేందుకు సెర్ప్, మెప్మా విలీనం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. భవిష్యత్తులో కోటి మంది మహిళలను శక్తివంతం చేయడం, లక్ష కోట్లు విలువైన మహిళా ఆర్థిక వ్యవస్థ నిర్మించడం, పెద్ద స్థాయిలో సంస్థాగత రుణాలు అందించడం వంటి లక్ష్యాలను ప్రభుత్వం నిర్ధేశించిందని తెలిపారు. వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, పలు వర్గాల ప్రజల కోసం కోసం సామాజిక భద్రతా కార్యక్రమాల రూపంలో పెన్షన్ల మొత్తాన్ని ఇప్పటికే రూ. 23వేల కోట్లు అందించామన్నారు.
2047 నాటికి 90%కు పెంచే లక్ష్యం
అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు జీడీపీలో 40%వరకు దోహదం చేస్తున్నా, భారత్ ఇంకా 20% కూడా దాటలేదని, ఈ అసమానతను తెలంగాణ చెరిపేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 52% మహిళా శ్రామిక భాగస్వామ్యాన్ని 2047 నాటికి 90%కు పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో డే కేర్ సెంటర్లు, మహిళలకు భద్రతా రవాణా, తక్కువ వడ్డీ రుణాలు, మహిళా సహకార సమాఖ్యలు, ఆన్‌లైన్ మార్కెట్లు, ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఇవన్నీ మహిళల కేంద్రంగా ఆర్థిక ప్రగతిని వేగవంతం చేయడానికి తీసుకుంటున్న చర్యలన్నారు. తెలంగాణలో మహిళలు అవకాశాల కోసం ఎదురు చూడడం లేదని, అవకాశాలను స్వయంగా సృష్టించే శక్తి మహిళల్లో పెరిగిందన్నారు. భవిష్యత్తులో మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం చేపట్టబోయే ప్రణాళికలను ఆవిష్కరించారు. మహిళా శక్తి తోడుగా 2047 నాటికి తెలంగాణ త్రీ ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులు, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో మహిళా ఆధారిత అభివృద్ధి అవకాశాలను పరిశీలించాలని పిలుపునిచ్చారు.
Also Read: Minister Seethakka: బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఫైర్.. స్ట్రాంగ్ కౌంటర్..!

