Avatar Fire and Ash: దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar: Fire and Ash) విడుదల కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ ఫ్రాంచైజీపై ఉన్న అంచనాలు కేవలం గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్స్ లేదా ఐమాక్స్ టెక్నాలజీకి మాత్రమే పరిమితం కాలేదు. దీని వెనుక, భారతీయ ప్రేక్షకులను లోతుగా కదిలించే ఒక బలమైన భావోద్వేగ బంధం ఉంది. ఇది మన సంస్కృతిలో అంతర్లీనంగా ఉండే కుటుంబ విలువలు, త్యాగం, అనుబంధాల కలబోత. ‘అవతార్’ హీరో జేక్ సల్లి (Jake Sully) పాత్రను పరిశీలిస్తే, అందులో మన భారతీయ కుటుంబ పెద్ద లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కుటుంబానికి అండగా నిలబడటం, వారిని శత్రువుల నుండి రక్షించడం, పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధపడటం… ఇవన్నీ మన సంస్కృతిలోని ‘కర్తవ్యం’ అనే భావానికి దర్పణం పడతాయి. ఆయన పాత్రలో కనిపించే నైతిక విలువలు, దృఢత్వం మన ఇళ్లల్లోని పెద్దలను గుర్తుచేస్తాయి.
బంధాలు, భాగస్వామ్యాలు.. మన ఫ్యామిలీ డ్రామా
ఇక నేటిరి పాత్ర… ఆమె కేవలం ప్రేయసి కాదు, శక్తి స్వరూపం. కుటుంబానికి రక్షణ కవచంగా నిలబడి, యోధురాలిగా పోరాడే ఆమె తెగువ, భారతీయ పురాణాల్లోని లేదా మన కుటుంబాల్లోని పట్టుదల గల స్త్రీమూర్తిని తలపిస్తుంది. ఆమె పాత్ర ఇల్లాలికి, యోధురాలికి మధ్య ఉన్న సమతుల్యతను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. సల్లి ఇంట్లో అన్నదమ్ములైన నెటేయమ్, లోఆక్ ల మధ్య ఉండే అనుబంధం మన భారతీయ కథలకు చాలా దగ్గరగా ఉంటుంది. అన్నపై బాధ్యత, తమ్ముడిపై ప్రేమ, చిన్న చిన్న అపార్థాలు, చివరికి కష్టం వచ్చినప్పుడు ఏకమవ్వడం.. ఈ ‘బ్రదర్‌హుడ్’ ట్రాక్ మన ఇక్కడి ఫ్యామిలీ డ్రామాలను గుర్తుకు తెస్తుంది. తల్లిదండ్రుల ఆశయాల నీడలో పెరిగే పిల్లలు, వారి మధ్య ఉండే భావోద్వేగ సంఘర్షణ.. ఇదంతా మన దైనందిన జీవితంలోని ఘట్టాలే.
Also Read- Anil Ravipudi: చిరుకి కథ నచ్చకపోవడంతో.. వెళ్తున్నానని చెప్పకుండానే జారుకున్నా!
ఐవా, పాండోరా.. మన ప్రకృతి ఆరాధన
పాండోరా గ్రహం కోసం నావీ జాతి మొత్తం ఏకమై పోరాడటం అనేది, ‘మన మట్టి, మన మనుషులు’ అనే భారతీయ భావోద్వేగానికి విశ్వరూపం. భూమిని తల్లిగా భావించడం, దాని రక్షణ కోసం ప్రాణాలనైనా అర్పించడం అనే కాన్సెప్ట్ మనకు కొత్త కాదు. ఇక పాండోరాను నడిపే ఆధ్యాత్మిక శక్తి ‘ఐవా’. ఇది ప్రకృతిని, జీవజాలాన్ని దైవంగా భావించి పూజించే మన వసుధైక కుటుంబం సిద్ధాంతానికి సరిగ్గా సరిపోతుంది. జేమ్స్ కామెరూన్ ఎప్పుడూ భారీ యాక్షన్‌తో పాటు హృదయాన్ని తాకే భావోద్వేగాలను జతచేస్తారు. ఆ భావోద్వేగాలే (కుటుంబం, స్నేహం, త్యాగం) ‘అవతార్’ ఫ్రాంచైజీకి అసలైన బలం. అందుకే, ఈ చిత్రంలో మనకు తెలియకుండానే ఒక బలమైన ‘ఇండియన్ కనెక్షన్’ కనిపిస్తుంది. ఈ అద్భుతమైన ఎమోషనల్ జర్నీని తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 19న వెండితెరపై వీక్షించవచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

