TG Global Summit: “తెలంగాణలో నిన్నటి వరకు ఓ లెక్క..గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క” అంటూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. ప్రజలు అండగా ఉన్నంత కాలం రైజింగ్ కు ఎలాంటి సమస్య లేదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం ప్రజలు ఇచ్చిన ధైర్యంతో తాను ముందుకు సాగుతున్నానని, జాతి కోసం, జనహితం కోసం పనిచేస్తూనే ఉంటానని ఆయన క్లారిటీ ఇచ్చారు. గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలని, గొప్ప కార్యాలు చేయాలంటే మహా సంకల్పం ఉండాలని ఆయన ఆదివారం ఎక్స్ లో భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పోస్టు చేశారు.
లెక్కలతో కొత్త మలుపులు
ఈ రెండేళ్ల ప్రస్థానంలో అనునిత్యం అహర్నిశలూ అవని పై తెలంగాణ(Telangana)ను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనతో శ్రమించానన్నారు. గత పాలన శిథిలాల కింద కొన ఊపిరితో ఉన్న నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశామన్నారు. రుణభారంతో వెన్ను విరిగిన రైతుకు దన్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపామన్నారు. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్ధతు ఇచ్చి అదానీ(Adani), అంబానీ(Ambani)ల లెక్క వ్యాపారరంగంలో నిలిపామన్నారు. బలహీన వర్గాల వందేళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పామన్నారు. వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేశామన్నారు. చదువొక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రం అని నమ్మి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశామన్నారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామన్నారు.
Also Read: TGSRTC: రెండేళ్లలో ఆర్టీసీ సాధించిన విజన్.. దేశానికే మార్గదర్శకం
వందేళ్ల మైలురాయి
స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం మూల సిద్దాంతంగా ముందుకు సాగుతున్నామన్నారు. “జయ జయహే తెలంగాణ” అన్న ప్రజాకవి అందెశ్రీ(Andeshri) గేయానికి, జన ఆకాంక్షల మేరకు అధికారిక గుర్తింపు ఇచ్చామన్నారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, రూ.500 కే గ్యాస్, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలని సీఎం వివరించారు. ప్రస్తుత అవసరాలు తీర్చి, పేదల సంక్షేమం కూర్చి ఇదే అద్భుతమని తాము సరిపెట్టలేదని, స్వతంత్ర భారత ప్రయాణం వందేళ్ల మైలురాయికి చేరే సందర్భం 2047 నాటికి మన తెలంగాణ ఎట్లుండాలి? ఎక్కడ ఉండాలి? అనే అంశాలను లోతైన మథనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేశామన్నారు.
కలలో కూడా ఊహించని విజన్
గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్ కు తాము ప్రాణం పోశామని, ప్రపంచ వేదిక పై “తెలంగాణ రైజింగ్” రీ సౌండ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. భారత దేశ గ్రోత్ ఇంజిన్(Growth Engine) గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశామన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క అంటూ అభివర్ణించారు. నిన్న.. నేడు.. రేపు ప్రజల ఆశీర్వాదమే తన ఆయుధం అంటూ సీఎం పేర్కొన్నారు. ప్రేమాభిమానాలు సర్వం అన్నారు. ప్రజల సహకరామే తనకు సమప్తమని, తెలంగాణ రైజింగ్ కు తిరుగులేదని ఆయన నొక్కి చెప్పారు. ప్రజలందరికీ రెండేళ్ల విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

