Minister Seethakka: గ్రామంలో అన్ని సౌకర్యాలు కల్పించుకోండి: త్రి సీతక్క
ములుగు, స్వేచ్ఛ: కాంగ్రెస్ పార్టీ (Congress Party) బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసి అభివృద్ధిని గెలిపించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క (Minister Seethakka) అభ్యర్థించారు. ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి వంగరి అనసూయ-సదానందం ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్థులను మంత్రి సీతక్క కోరారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పల్లెలు అభివృద్ధికి నోచుకోలేదని, నేడు ప్రజల చేత ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థికి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకొని గ్రామాల్లో అన్ని సౌకర్యాలను కల్పించుకోవాలని సూచించారు.
మాటల గారడీ చేసే బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లోకి వస్తారని వారి మాటలు నమ్మి మోసపోవద్దని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కోసం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి మంత్రాన్ని నిజం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజా పాలన లో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులను గ్రామాల్లో చేసుకునేందుకు మీ గ్రామం నుంచి ప్రభుత్వానికి వారదిగా సర్పంచులు చేసి పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి,మండల పార్టీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్ సీనియర్ నాయకులు యూత్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం : మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు
మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు కోరారు. ఆదివారం పాపన్నపేట మండలం ఎల్లాపూర్, పొడిచన్‌పల్లి తండా, శేరిపల్లి, కొడుపాక, నాగసన్ పల్లి, గాజుల గూడెం తదితర గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసి కాంగ్రెస్ అభ్యర్థుల పక్షాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రెండేళ్ల కాలంలో మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయించామని తెలిపారు. గత పాలకులు మెదక్ నియోజకవర్గ అభివృద్ధి ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలు ప్రవేశ పెట్టామన్నారు. ఇల్లులేని నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని తెలిపారు.
మహిళకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయికి ప్రజలందరికి అందేలా కృషి చేస్తానన్నారు.అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్ళు అందిస్తామని తెలిపారు.రేషన్ కార్డులు లేని వారందరికీ రేషన్ కార్డులు ఇప్పిస్తామన్నారు.ఎన్నికల్లో చెప్పిన విదంగా ఆరు గ్యారెంటీ లను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. మెదక్ నియోజకవర్గం లో మౌళిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కి కోట్లాది రూపాయల నిధులు తెచ్చినట్లు తెలిపారు.నియోజకవర్గ ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి వారి కష్ట సుఖాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.ఈ సందర్బంగా మండలంలో ఆయా గ్రామాల్లో ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు పబ్బతి ప్రభాకర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

