Illegal Mining: అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈడీ ముందు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో మంగళవారం ఆయన విచారణఖు హాజరయ్యారు. ఈడీ కార్యాలయం నుంచి ఆయన బయటికి వస్తుండగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేదు. ఈ కేసులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారా? అని ప్రశ్నించగా సమాధానం ఇవ్వకుండా నేరుగా వెళ్లి ఆయన కారులో కూర్చున్నారు. విచారణకు హాజరు కావాలని ఈడీ ఇటీవలే పంపిన ఓ నోటీసుకు సమాధానంగా ఆయన మంగళవారం ఈడీ ఆఫీసుకు వచ్చారు.
గత వారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిల నివాసాలు సహా సుమారు ఏడు చోట్ల తనిఖీలు చేసింది. మధుసూదన్ రెడ్డికి సంబంధించిన క్వారీ కంపెనీలోనూ తనిఖీలు జరిగాయి. రెండు రోజలుపాటు జరిగిన ఈ సోదాల్లో ఈడీ కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వానికి రూ. 300 కోట్ల వరకు నష్టం వాటిల్లే విధంగా వారు వ్యవహరించినట్టు చెప్పారు. అలాగే, రూ. 39 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. వీరిద్దరూ అక్రమ మైనింగ్‌లో సంపాదించిన డబ్బుతో ఇతర బ్యాంకులకు పంపినట్టు, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టినట్టు ఆ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కోణంలో మనీలాండరింగ్ జరిగిందా? అనే అనుమానాలు ఉన్నాయి.
అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించి ముందుగా హైదరాబాద్ పోలీసులు కేసు పెట్టారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగ ప్రవేశం చేసింది.